Sydney Bondi Beach Shooter: ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి.. షూటర్‌ను ఒంటిచేత్తో ఎదుర్కొన్న సామాన్యుడు... వీడియో వైరల్

Sydney Bondi Beach Shooter Confronted by Heroic Bystander in Australia
  • ఆస్ట్రేలియా బాండీ బీచ్‌లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం
  • 10 మంది మృతి, 29 మందికి తీవ్ర గాయాలు
  • తుపాకీతో కాల్పులు జరుపుతున్న షూటర్‌ను అడ్డుకున్న సామాన్య పౌరుడు
  • యూదుల పండుగను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ప్రకటన
  • సామాన్యు పౌరుల ధైర్యాన్ని కొనియాడిన ఆస్ట్రేలియా ప్రధాని
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణమైన ఉగ్రదాడి చోటుచేసుకుంది. ప్రఖ్యాత బాండీ బీచ్‌లో ఉగ్రవాదులు జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 29 మంది గాయపడ్డారు. ఈ భయానక ఘటనలో ఓ సామాన్య పౌరుడు చూపిన అసమాన ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రాణాలకు తెగించి, ఓ ఉగ్రవాదిపైకి దూసుకెళ్లి అతని చేతిలోని షాట్‌గన్‌ను లాక్కున్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఫుట్‌పాత్‌పై నిలబడి ఓ దుండగుడు కాల్పులు జరుపుతుండగా, సమీపంలో కారు వెనుక నక్కిన ఓ వ్యక్తి ఒక్కసారిగా అతనిపైకి దూకాడు. ఇద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో ఉగ్రవాది చేతిలోని గన్‌ను లాక్కుని, అతడిని కిందపడేశాడు. ఆ గన్‌ను దుండగుడికి ఎక్కుపెట్టడంతో అతను వెనక్కి తగ్గాడు. అనంతరం ఆ వ్యక్తి తుపాకీని ఓ చెట్టుకు ఆనించి, తాను దుండగుడ్ని కాదు అని పోలీసులు గుర్తించేలా శాంతియుతంగా చేతులు పైకెత్తాడు.

ఆదివారం సాయంత్రం యూదుల 'హనుక్కా' పండుగ వేడుకలు జరుగుతున్న ప్రదేశంలో ఈ దాడి జరిగింది. దీనిని ఉగ్రవాద చర్యగా అధికారులు ప్రకటించారు. ఈ దాడిని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్రంగా ఖండించారు. "యూదుల పండుగ రోజున వారిని లక్ష్యంగా చేసుకుని చేసిన క్రూరమైన దాడి ఇది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడిన సామాన్యులు నిజమైన హీరోలు. వారి ధైర్యం ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది" అని ఆయన అన్నారు.

ఈ దాడిలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో ఒకరిని కాల్చి చంపగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడో వ్యక్తి ప్రమేయంపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ స్పందిస్తూ, "ఈ విషాదంలో కూడా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించే సామాన్యులు మన మధ్య ఉన్నారనడానికి ఇదే నిదర్శనం" అని పేర్కొన్నారు.
Sydney Bondi Beach Shooter
Sydney
Bondi Beach
Australia Terror Attack
Hanukkah festival
Anthony Albanese
Chris Minns
Gun Violence

More Telugu News