ఎవరీ నితిన్ నబిన్... బీజేపీకి కొత్త రథ సారథి

  • బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్ నియామకం
  • ప్రస్తుతం బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నబిన్
  • జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో పార్టీలో మార్పులు
  • ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవజ్ఞుడైన నేత
బీజేపీ నూతన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ను నియమించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఆదివారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. 2020 జనవరిలో బాధ్యతలు చేపట్టిన నడ్డా, 2024 లోక్‌సభ ఎన్నికలతో సహా పలు కీలక రాజకీయ ఘట్టాల నేపథ్యంలో పలుమార్లు పదవీకాలం పొడిగింపు పొందారు. పార్టీలో నాయకత్వ మార్పుల ప్రక్రియ జరుగుతున్న తరుణంలో ఈ తాజా పునర్వ్యవస్థీకరణకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఎవరీ నితిన్ నబిన్?

నితిన్ నబిన్ బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక అనుభవజ్ఞుడైన బీజేపీ నేత. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పాట్నాలో జన్మించిన ఆయన, దివంగత బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నితిన్ నబిన్ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు.

నితిన్ నబిన్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు. తన తండ్రి మరణం తర్వాత 2006లో పాట్నా వెస్ట్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో తొలిసారిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బంకీపుర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు - 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. ముఖ్యంగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, నటుడు, రాజకీయ నాయకుడైన శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలిచి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు.

ఇటీవల ముగిసిన 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆయన తన సమీప ప్రత్యర్థిపై 51,000 ఓట్లకు పైగా భారీ ఆధిక్యంతో మరోసారి ఘన విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన నితీశ్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

రాష్ట్ర స్థాయిలో బలమైన నేతగా, ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన వ్యక్తిగా నితిన్ నబిన్‌కు మంచి పేరుంది. ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడు కావడంతో, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇది ఒక కీలక మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News