Julakanti Brahmananda Reddy: పిన్నెల్లి వంటి నరరూప రాక్షసులకు జగన్ అండగా నిలుస్తున్నారు: జూలకంటి బ్రహ్మానందరెడ్డి

Julakanti Brahmananda Reddy Slams Jagan Support for Pinnelli
  • తోట చంద్రయ్య, జల్లయ్య హత్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే
  • పిన్నెల్లి అరెస్ట్‌తో మాచర్ల ప్రజలు దీపావళి చేసుకుంటున్నారని వెల్లడి
  • కోర్టు ఆదేశాలను వైసీపీ గౌరవించడం లేదని విమర్శ
  • గత ఐదేళ్లు మాచర్లలో పిన్నెల్లి రాజ్యాంగమే నడిచిందని వ్యాఖ్యలు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నరరూప రాక్షసులకు వైసీపీ అధినేత జగన్ మద్దతు ఇస్తున్నారంటూ మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి అరెస్ట్ అయితే, దానిని అక్రమ నిర్బంధమని వైసీపీ నేతలు ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మాచర్లలో నెలకొన్న పరిస్థితులపై ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

"ఒక నరహంతకుడు జైలుకు వెళితే మాచర్ల ప్రజలు మళ్లీ దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు. ప్రజలు ఆనందంగా ఉండటాన్ని చూసి ఓర్వలేక, రాజకీయ కక్ష సాధింపు అంటూ వైసీపీ డ్రామాలకు తెరలేపింది. అధికార మదంతో చేసిన నేరాలు, ఘోరాలు శాపాలుగా వెంటాడుతుంటే, అక్రమ కేసులని సానుభూతి కోసం టాపిక్ డైవర్షన్ రాజకీయాలు చేయడం వైసీపీకే చెల్లుతుంది" అని బ్రహ్మానందరెడ్డి ఎద్దేవా చేశారు.

పిన్నెల్లి సోదరులు చేసిన దాడులు, దౌర్జన్యాలు, హత్యలను ప్రజలు కళ్లారా చూశారని ఆయన అన్నారు. "తురకా కిశోర్ వంటి రాక్షసులను తయారు చేసి ప్రజల మీదకు వదిలి, వారి ఆర్తనాదాల మధ్య జగన్‌తో కలిసి సైకో ఆనందం పొందారు. 'జై జగన్' అనలేదని తోట చంద్రయ్యను గొంతు కోసి చంపారు. జల్లయ్యను పొట్టన పెట్టుకున్నారు. బడుగు, బలహీన వర్గాలను హింసించి, హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. వాళ్లు మనుషులు కాదా? నరహంతకులను వెనకేసుకొస్తున్న జగన్‌కు కనీసం మానవత్వం ఉందా?" అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.

ఒక హంతకుడి పాపం పండి కోర్టు ఆదేశాలతో అరెస్ట్ అయితే, దానిని అక్రమ నిర్బంధం అనడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని అన్నారు. వైసీపీకి న్యాయస్థానాలంటే లెక్కలేదని, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని ఈ వ్యాఖ్యలతోనే అర్థమవుతోందని విమర్శించారు. జగన్ లాంటి సైకో మనస్తత్వం ఉన్న నాయకులు రాష్ట్రంలో ఉండటం అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

గత ఐదేళ్లలో మాచర్ల నియోజకవర్గాన్ని రావణకాష్ఠంలా మార్చారని, తాలిబన్ల మాదిరి ప్రజలపై దమనకాండ సాగించారని ఆరోపించారు. జగన్ అండతోనే వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పిన్నెల్లి సోదరులు పేట్రేగిపోయారని, మాచర్లలో వారి రాజ్యాంగమే అమలైందని దుయ్యబట్టారు. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేయడం, విధి నిర్వహణలో ఉన్న సీఐపై హత్యాయత్నం చేయడం వంటి చర్యలతో బరితెగించారని గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాల రక్తం తాగిన ఈ నరరూప రాక్షసులు ఇప్పుడు చట్టం ముందు అడ్డంగా దొరికిపోయారని, చేసిన పాపాలు ఊరికే పోవని బ్రహ్మానందరెడ్డి అన్నారు.
Julakanti Brahmananda Reddy
Pinnelli Ramakrishna Reddy
Macharla
YS Jagan
Tota Chandraiah murder
Andhra Pradesh politics
YSRCP
political crime
election violence
Telugu news

More Telugu News