Pawan Kalyan: ఆ నియోజకవర్గ ప్రజలు పవన్ కు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

Minister Anam comments about Pawan Kalyan
  • ఆత్మకూరు అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన పవన్ కల్యాణ్
  • పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారన్న మంత్రి ఆనం
  • జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శ
  • ఉద్యోగుల బకాయిల్లో రూ.12 వేల కోట్లు చెల్లించామన్న ఆనం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అడిగిన వెంటనే పవన్ నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఆదివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆనం, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ, గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆత్మకూరు నియోజకవర్గంలోని 10 పంచాయతీ భవనాల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిధులు విడుదల చేశారని మంత్రి తెలిపారు. అలాగే, ఆత్మకూరు ప్రాంతీయ ఆసుపత్రిని 250 పడకలకు విస్తరిస్తున్నామని, భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, కర్నూలులో దేవాదాయశాఖ జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఆనం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలతో అప్పుల్లో ముంచెత్తింది. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోలేని దుస్థితిని చూశాం. గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ.32 వేల కోట్ల బకాయిలు పెడితే, మా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ.12 వేల కోట్లు చెల్లించింది" అని తెలిపారు. రూ.120 కోట్లతో సోమశిల అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. జగన్ మాయలో పడి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడటం దురదృష్టకరమని ఆనం వ్యాఖ్యానించారు.
Pawan Kalyan
Anam Ramanarayana Reddy
Atmakur
Andhra Pradesh
Nellore
YS Jagan Mohan Reddy
TDP
Janasena
AP Politics
Development Funds

More Telugu News