Bondi Beach: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో కాల్పులు... 10 మంది మృతి

Bondi Beach Shooting in Australia Leaves 10 Dead
  • సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్‌లో కాల్పులు
  • ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసుల హెచ్చరిక
  • ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడినట్టు సమాచారం
  • కాల్పుల శబ్దాలతో పరుగులు తీసిన పర్యాటకులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పుల కలకలం రేగింది. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో కనీసం 10 మంది మరణించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, భారీ భద్రతను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలు అటువైపు రావొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:45 గంటల సమయంలో బాండీ బీచ్‌లో పలువురిపై కాల్పులు జరిగాయని సమాచారం అందడంతో న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇది ఇంకా కొనసాగుతున్న ఘటన అని, సమీప ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని పోలీసులు సూచించారు.

కాల్పుల శబ్దాలు, పోలీసు సైరన్లతో బాండీ బీచ్ ప్రాంతం దద్దరిల్లింది. ప్రాణభయంతో పర్యాటకులు, స్థానికులు పరుగులు తీస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నల్ల దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బాండీ బీచ్‌లోని ఒక వంతెన వద్ద కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఈ ఘటనపై ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కార్యాలయం స్పందించింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రజలు పోలీసుల సూచనలు పాటించాలని కోరింది. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఇద్దరు దుండగుల్లో ఒకరిని భద్రతా బలగాలు హతమార్చాయి.
Bondi Beach
Sydney
Australia
Bondi Beach shooting
Sydney shooting
Anthony Albanese
New South Wales
Crime
Terrorism

More Telugu News