Lionel Messi: మెస్సీ విగ్రహంపై ట్రోల్స్.. సచిన్‌కు స్మిత్, ఇప్పుడు మెస్సీకి రూట్!

Lionel Messi Statue Trolled Sachin Tendulkar Steve Smith Repeat
  • కోల్‌కతాలో మెస్సీ విగ్రహంపై వెల్లువెత్తిన ట్రోల్స్
  • విగ్రహం ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్‌ను పోలి ఉందంటూ వ్యాఖ్యలు
  • గతంలో సచిన్ విగ్రహంపైనా ఇలాగే ట్రోల్స్ 
  • కోల్‌కతా ఈవెంట్ విఫలం.. హైదరాబాద్‌లో విజయవంతం
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన సచిన్ టెండూల్కర్ విగ్రహం స్టీవ్ స్మిత్‌ను పోలి ఉందంటూ విపరీతమైన ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో కోల్‌కతాలో ఏర్పాటు చేసిన మెస్సీ విగ్రహం ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్‌లా ఉందంటూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.

‘గోట్ టూర్ ఇండియా 2025’లో భాగంగా మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నాడు. తన పర్యటనలో భాగంగా తొలుత కోల్‌కతా వెళ్లిన మెస్సీ గౌరవార్థం అక్కడ నిర్వాహకులు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆ విగ్రహం మెస్సీలా కాకుండా జో రూట్‌లా ఉండటంతో "సచిన్‌కు స్టీవ్ స్మిత్, మెస్సీకి జో రూట్.. ఇండియాలో క్రీడాకారుల విగ్రహాలు భలే పెడుతున్నారు" అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

విగ్రహం సంగతి పక్కన పెడితే, కోల్‌కతాలో మెస్సీ పర్యటన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. సాల్ట్ లేక్ స్టేడియంలో రూ. 4,500 నుంచి రూ.12 వేల వరకు ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసినా, మెస్సీ కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించాడు. అదీ కూడా వీవీఐపీలు, రాజకీయ నాయకుల మధ్య చిక్కుకుపోవడంతో అభిమానులు అతడిని సరిగా చూడలేకపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు కుర్చీలు విరగ్గొట్టి, వాటర్ బాటిళ్లు విసిరేశారు.

అయితే, కోల్‌కతాకు పూర్తి భిన్నంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమం విజయవంతమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫుట్‌బాల్ ఆడి అభిమానులను ఉత్సాహపరిచాడు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. మెస్సీ ఫుట్‌బాల్స్‌ను ప్రేక్షకుల వైపు తన్ని వారిని ఉర్రూతలూగించాడు. నేడు ముంబైలో జరగనున్న కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో పాటు పలువురు క్రికెట్, బాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు.
Lionel Messi
Messi statue
Sachin Tendulkar
Joe Root
Steve Smith
Kolkata
Hyderabad
Football
Statue controversy
Indian sports

More Telugu News