Mahesh Kumar Goud: కేసీఆర్‌కు హరీశ్‌రావుతో ప్రమాదం.. జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Warns KCR About Harish Rao Threat
  • ఏ క్షణంలోనైనా హరీశ్ వెన్నుపోటు పొడుస్తారని హెచ్చరిక
  • కేటీఆర్ సోషల్ మీడియాను డబ్బుతో నడిపిస్తున్నారని ఆరోపణ
  • మంత్రి పదవిపై ఆసక్తి లేదు, టీపీసీసీ అధ్యక్షుడిగానే సంతోషమంటూ వ్యాఖ్య‌
  • హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు స్పష్టమైన విజన్ ఉంద‌న్న టీపీసీసీ చీఫ్
మాజీ మంత్రి హరీశ్‌రావు విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు ఏ క్షణంలోనైనా కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఎవరికైనా ఉంటుందని హరీశ్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌కు భవిష్యత్తు ఉంటే కవిత ఎందుకు బయటకు వస్తారని ప్రశ్నించారు. మాజీ మంత్రి కేటీఆర్ తనకున్న డబ్బుతో సోషల్ మీడియాను మ్యానేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదని, వారు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పార్టీ వ్యవహారాలపైనా మహేశ్ గౌడ్ స్పందించారు. కేబినెట్ ప్రక్షాళనపై కసరత్తు జరుగుతోందని, తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవిపై ఆసక్తి లేదని, టీపీసీసీ అధ్యక్షుడిగానే ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉందని, హైదరాబాద్‌ను ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, రాబోయే ఏ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ సునాయాసంగా గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
Mahesh Kumar Goud
KCR
Harish Rao
BRS party
Telangana Congress
Revanth Reddy
Telangana Politics
KTR
Kavitha
TPCC President

More Telugu News