Smart Ration Card: స్మార్ట్ రేషన్ కార్డుకు రేపే ఆఖ‌రి గ‌డువు.. తర్వాత డబ్బులు చెల్లించాల్సిందే!

Smart Ration Card Deadline Tomorrow in Andhra Pradesh
  • స్మార్ట్ రేషన్ కార్డుల ఉచిత పంపిణీకి రేపే ఆఖరు తేదీ
  • గడువు దాటితే కార్డుకు రూ.200 చెల్లించాల్సిందేనన్న అధికారులు
  • పశ్చిమ గోదావరిలో ఇప్పటికే 95.5 శాతం కార్డుల పంపిణీ పూర్తి
  • గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా కార్డుల జారీ
ఏపీలోని రేషన్‌కార్డుదారులకు అధికారులు కీలక సూచ‌న‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తున్న క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా పొందేందుకు రేపే చివరి అవకాశమని స్పష్టం చేశారు. ఈ గడువులోగా కార్డులు తీసుకోకపోతే, ఆ తర్వాత రుసుము చెల్లించి పొందాల్సి ఉంటుందని తెలిపారు. గడువుకు ఇంకొక్క రోజే మిగిలి ఉండటంతో ఇంకా కార్డులు తీసుకోని లబ్ధిదారులు వెంటనే తమ సచివాలయాలను సంప్రదించాలని తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. గడువు ముగిసిన తర్వాత కార్డు పొందాలంటే రూ.200 చెల్లించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. జిల్లాలో మొత్తం 6,14,000 రేషన్‌ కార్డులు ఉండగా, ఇప్పటికే 95.5 శాతం అంటే 5,87,000 కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలోనే తొలివిడత పంపిణీలో పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇంకా 27,000 కార్డులు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు.

కొంతమంది లబ్ధిదారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వల్ల సిబ్బంది ఇంటింటికీ తిరిగినా వంద శాతం పంపిణీ పూర్తి కాలేకపోతోందని చెబుతున్నారు. గడువులోగా తీసుకోని కార్డులను కమిషనరేట్‌కు తిప్పి పంపుతామని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే.. కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, డిసెంబర్ నుంచి సరుకులు తీసుకుంటున్న లబ్ధిదారులకు ఇంకా స్మార్ట్ కార్డులు అందలేదు. ఉచిత పంపిణీ గడువు రేపటితో ముగియనుండటంతో తమ పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Smart Ration Card
AP Ration Card
Ration Card Deadline
Andhra Pradesh
West Godavari
QR Code Ration Card
Ration Distribution
Civil Supplies Department

More Telugu News