Maggi Capsules: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మ్యాగీ క్యాప్సూల్' వీడియోలు.. అసలు కథ ఇదే!

Maggi Capsule Videos Shake Social Media The Real Story
  • వేడి నీళ్లలో వేస్తే నూడుల్స్‌గా మారే 'మ్యాగీ క్యాప్సూల్'
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
  • ఇవన్నీ ఏఐ సృష్టించిన ఫేక్ వీడియోలని వెల్లడి
  • ఇతర నెలల్లో ఏప్రిల్ ఫూల్ చేయొద్దన్న మ్యాగీ ఇండియా
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ నూడుల్స్ బ్రాండ్‌లలో మ్యాగీ ఒకటి. దశాబ్దాలుగా ఎన్నో కుటుంబాలలో ఇది ఒక భాగంగా మారిపోయింది. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో 'మ్యాగీ క్యాప్సూల్' పేరుతో కొన్ని వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక చిన్న క్యాప్సూల్‌ను వేడి నీళ్లలో వేయగానే అది మ్యాగీ నూడుల్స్‌గా మారిపోవడం ఈ వీడియోలలో కనిపిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోల్లో ఏముందంటే..!
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ఒక వ్యక్తి మ్యాగీ బ్రాండ్ పేరున్న పసుపు రంగు క్యాప్సూల్‌ను చూపిస్తాడు. దానిని మరుగుతున్న నీటిలో వేయగానే వెంటనే నూడుల్స్, మసాలా బయటకు వస్తాయి. వాటిని ఉడికించి తిని, రుచి అచ్చం మ్యాగీలాగే ఉందని చెప్తాడు. ఇలాంటిదే మరో వీడియోలో ఒక మహిళ కూడా ఇదే ట్రిక్‌తో మ్యాగీ తయారు చేస్తుంది.

ఈ వీడియోలు చూసిన చాలామంది ఇది నిజమేనని నమ్మారు. మ్యాగీ నిజంగానే కొత్తగా క్యాప్సూల్ ప్రొడక్ట్‌ను లాంచ్ చేసిందేమోనని ఆశ్చర్యపోయారు. అయితే, ఈ వీడియోలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో సృష్టించిన ఫేక్ వీడియోలని తేలింది. దీనిపై మ్యాగీ ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్పందిస్తూ, "దయచేసి ఇతర నెలల్లో ఏప్రిల్ ఫూల్ డే జరుపుకోవద్దు" అని సరదాగా కామెంట్ చేసింది.

ఇక‌, చాలామంది నెటిజన్లు ఈ వీడియోలలోని తప్పులను గుర్తించారు. ఒక వీడియోలో ఫోర్క్ వంగిపోయి ఉండటాన్ని, మరొకదానిలో మనిషి హావభావాలు అసహజంగా ఉన్నాయని కామెంట్ల రూపంలో తెలిపారు. "ఏఐ టెక్నాలజీ అదుపు తప్పుతోంది" అని ఒకరు వ్యాఖ్యానించగా, "అబద్ధమని చెప్పడానికి మీ వంకర ఫోర్క్ చాలు" అని మరొకరు ఎత్తిచూపారు. దీంతో ఈ వైరల్ వీడియోలన్నీ కేవలం ఏఐ సృష్టించిన కట్టుకథలని తేలిపోయింది.
Maggi Capsules
Maggi
instant noodles
AI videos
artificial intelligence
viral videos
fake videos
social media
food
noodles

More Telugu News