Ben Stokes: యాషెస్ సిరీస్‌లో వేడి... ఇంగ్లండ్ కెప్టెన్, ఆసీస్ జర్నలిస్ట్ మధ్య వాగ్వాదం

Ben Stokes Confronts Journalist at Adelaide Airport
యాషెస్ సిరీస్‌లో మైదానం బయట ముదురుతున్న వివాదాలు
అడిలైడ్ ఎయిర్‌పోర్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో జర్నలిస్ట్ ఘర్షణ
తనను రహస్యంగా వీడియో తీయడంపై స్టోక్స్ తీవ్ర అభ్యంతరం
ఇంగ్లండ్ జట్టు భద్రతా సిబ్బంది తీరుపై పెరుగుతున్న విమర్శలు
గతంలో విరాట్ కోహ్లీకి కూడా ఇలాంటి అనుభవం 
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌లో మైదానం బయట కూడా వాతావరణం వేడెక్కుతోంది. మూడో టెస్టు కోసం అడిలైడ్ చేరుకున్న ఇంగ్లండ్ జట్టుకు, ఆస్ట్రేలియా మీడియాకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా అడిలైడ్ విమానాశ్రయంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను స్థానిక జర్నలిస్ట్ ఒకరు రహస్యంగా వీడియో తీయడం వివాదానికి దారితీసింది.

'సండే మెయిల్' జర్నలిస్ట్ డారెన్ చైట్‌మన్.. అడిలైడ్‌లో ‘సైట్ సీయింగ్’ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అంటూ స్టోక్స్‌ను కాస్త వెటకారంగా ప్రశ్నించాడు. అదే సమయంలో తన ఫోన్‌లో వీడియో రికార్డ్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్టోక్స్ "ఇంతసేపు నన్ను వీడియో తీస్తున్నావా?" అని అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనకు సమాచారం ఇవ్వకుండా రికార్డ్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇంగ్లండ్ జట్టు సిబ్బంది జోక్యం చేసుకున్నారు.

ఈ క్రమంలో జట్టు సిబ్బంది ఒకరు జర్నలిస్ట్‌ను ఫోన్ కింద పెట్టమని సూచించారు. కాసేపటి తర్వాత అతడు తన వైపు చూస్తూ అసభ్య పదజాలంతో దూషించాడని జర్నలిస్ట్ చైట్‌మన్ ఆరోపించాడు. అయితే, ఈ సంఘటన కెమెరాలో రికార్డు కాలేదని పేర్కొన్నాడు.

అదే రోజు బ్రిస్బేన్ విమానాశ్రయంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంగ్లండ్ భద్రతా సిబ్బంది కోలిన్ రూమ్స్, చానల్ సెవెన్ కెమెరామెన్‌పై ‘నా ముందు నుంచి వెళ్లు’ అంటూ విరుచుకుపడ్డాడు. ఈ రెండు ఘటనలతో ఇంగ్లండ్ జట్టు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రెండో టెస్టులో ఓటమి, మ్యాచ్‌ల మధ్యలో ఆటగాళ్లు విహారయాత్రకు వెళ్లడం వంటి అంశాలపై ఇంగ్లండ్ జట్టు విమర్శలు ఎదుర్కొంటోంది.

అయితే, గతంలోనూ ఆస్ట్రేలియా మీడియా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. గతేడాది భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కుటుంబాన్ని అనుమతి లేకుండా వీడియో తీయడంతో ఆయన కూడా ఓ జర్నలిస్టుతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే.
Ben Stokes
Ashes Series
England Cricket
Australia Media
Darren Chatman
Adelaide Airport
Cricket Controversy
Virat Kohli
Cricket Journalism
Sports News

More Telugu News