'పుష్ప 2' రికార్డును బద్దలు కొట్టిన రణవీర్ 'ధురంధర్'

  • రణవీర్ 'ధురంధర్'కు రెండో శుక్రవారం రికార్డు స్థాయి వసూళ్లు
  • 'పుష్ప 2' పేరిట ఉన్న రికార్డును అధిగమించిన బాలీవుడ్ చిత్రం
  • ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు దాటిన గ్రాస్ కలెక్షన్లు
  • వారంలోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన సినిమా
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం, తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సినిమా విడుదలైన రెండో శుక్రవారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్' సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, రెండో శుక్రవారమైన 12వ తేదీన ఏకంగా రూ.34.70 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటివరకు ఈ రికార్డు 'పుష్ప 2' హిందీ వెర్షన్ పేరిట (రూ.27.50 కోట్లు) ఉండేది. తాజాగా ఆ రికార్డును 'ధురంధర్' అధిగమించింది. ఈ జాబితాలో 'ఛావా' (రూ.24.30 కోట్లు), 'యానిమల్' (రూ.23.53 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం 'ధురంధర్' ఇప్పటివరకు కేవలం ఇండియాలోనే రూ.252 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు రూ.300 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావ‌డంతో కాసుల వ‌ర్షం కురుస్తోంద‌ని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్‌లో 'రైడ్ 2', 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' వంటి చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసింది. అలాగే గత 17 ఏళ్లలో బాలీవుడ్‌లో అత్యధిక నిడివి ఉన్న చిత్రంగా కూడా 'ధురంధర్' నిలవడం విశేషం.




More Telugu News