టికెట్‌కు పదివేలు... మెస్సీకి బదులు కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్.. వైర‌ల్ వీడియో!

  • కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ రసాభాస
  • అధిక ధరలకు టికెట్లు కొన్నా మెస్సీ కనిపించలేదని ఫ్యాన్స్ ఆగ్రహం
  • స్టేడియంలో కుర్చీలు, బ్యానర్లు ధ్వంసం చేసిన అభిమానులు
  • టికెట్ డబ్బులకు బదులుగా కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఓ వ్యక్తి
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో తీవ్ర గందరగోళం నెలకొంది. 'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా నిన్న‌ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం రసాభాసగా మారింది. అధిక ధరలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసినా తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేకపోయామంటూ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
మెస్సీ మైదానంలోకి వచ్చినప్పుడు ఆయన చుట్టూ సుమారు 100 మందికి పైగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, భద్రతా సిబ్బంది గుమిగూడారు. దీంతో గ్యాలరీలోని అభిమానులకు మెస్సీ సరిగ్గా కనిపించలేదు. భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినా తమ స్టార్‌ను చూడలేకపోయామనే ఆవేదనతో ఫ్యాన్స్ నిరసనకు దిగారు. ఈ నిరసన కొద్దిసేపటికే హింసాత్మకంగా మారింది.

అభిమానులు స్టేడియంలోని కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేయడంతో పాటు బ్యానర్లను చించివేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మెస్సీ కేవలం 20-25 నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ అభిమాని ఏకంగా స్టేడియంలోని కార్పెట్‌ను భుజంపై వేసుకుని ఇంటికి తీసుకెళ్తూ కనిపించాడు.

రిపోర్టర్ ప్రశ్నించగా, ఆ అభిమాని స్పందిస్తూ... "రూ.10,000 పెట్టి టికెట్ కొన్నాను. కానీ మెస్సీ ముఖం కూడా చూడలేకపోయాను. నాకు కనిపించిందల్లా నాయకుల ముఖాలే. అందుకే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ కార్పెట్ ఇంటికి తీసుకెళ్తున్నా" అని బదులిచ్చాడు. ఆ ఫ్యాన్ వీడియో ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా.. నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 


More Telugu News