నేర్చుకోవడం ఆపితేనే వృద్ధాప్యం.. విద్యార్థులకు సుధా మూర్తి స్ఫూర్తిదాయక సందేశం

  • నిరంతరం నేర్చుకోవడమే యవ్వనానికి రహస్యం అన్న సుధా మూర్తి
  • ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని విజయాలు సాధించాలని సూచన
  • చాట్‌జీపీటీ వంటి టూల్స్ వృత్తి అనుభవానికి ప్రత్యామ్నాయం కాదని స్పష్టీకరణ
  • విశాఖ నెక్స్ట్ టెక్ హబ్‌గా ఎదుగుతోందన్న జీఎం రావు
  • ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రముఖుల సందడి
ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి విద్యార్థులకు జీవితానికి సంబంధించిన అమూల్యమైన పాఠాలు చెప్పారు. నిరంతరం నేర్చుకోవడమే నిజమైన యవ్వనమని, నైతిక విలువలే ఉన్నత స్థానానికి చేరుస్తాయని ఆమె ఉద్బోధించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశం 'వేవ్స్ 2025'కు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె, విద్యార్థులు, పూర్వ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా సుధామూర్తి మాట్లాడుతూ "నేర్చుకోవడం, ప్రశ్నించడం ఆపేసినప్పుడే మనిషికి వృద్ధాప్యం వస్తుంది. జీవితాంతం నేర్చుకోవడం ద్వారానే ఆనందం లభిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ సొంత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి, ఎవరి మారథాన్‌లో వారే పరుగెత్తాలి" అని సూచించారు. విజయం, వైఫల్యం జీవితంలో సర్వసాధారణమని, ఓటముల నుంచే పాఠాలు నేర్చుకొని గెలుపునకు బాటలు వేసుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు. "నిరంతర విజయాలు అహంకారాన్ని పెంచుతాయి. వేసే ప్రతి అడుగు ఒక అనుభవ పాఠం కావాలి. ఈరోజు వేదికపై ఉన్నవారంతా ఓటముల నుంచి పాఠాలు నేర్చుకున్నవారే" అని ఆమె అన్నారు.

డబ్బు అవసరమే అయినా, అధిక ధనం కుటుంబాలను నాశనం చేస్తుందని సుధామూర్తి హెచ్చరించారు. అజ్ఞానాన్ని, అంధకారాన్ని తొలగించే శక్తి విద్యకు మాత్రమే ఉందని నొక్కిచెప్పారు. భారతీయ పురాణాల నుంచి గంగ, నచికేతుడు-యముడి సంవాదం వంటి కథలను ఉదహరిస్తూ.. సంపద, విజయం పెరిగేకొద్దీ దాతృత్వం, క్రమశిక్షణ, మానసిక బలం ఎంత ముఖ్యమో వివరించారు. చాట్‌జీపీటీ వంటి సాంకేతిక సాధనాలు వృత్తిపరమైన అనుభవాన్ని భర్తీ చేయలేవని స్పష్టం చేశారు. అవి కేవలం సహాయపడతాయే తప్ప, ఉద్యోగాన్ని నిలబెట్టలేవని అన్నారు. ప్రతి ఒక్కరూ మాతృ సంస్థను, మాతృ భాషను, మాతృభూమిని గౌరవించాలని గుర్తుచేశారు.

ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక చైర్మన్, జీఎంఆర్ గ్రూపు సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ దూరదృష్టితో విశాఖపట్నం భారతదేశానికి ‘నెక్స్ట్ టెక్ హబ్’గా మారబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్-మెటా ప్రాజెక్టులు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి పరిణామాలతో విశాఖ ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. పూర్వ విద్యార్థులు కనీసం ఒక్క విద్యార్థికైనా మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు.

ఏయూ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ, శతాబ్ది పూర్తి చేసుకున్న విశ్వవిద్యాలయం, రాబోయే 100 ఏళ్లకు ప్రణాళికలు రచిస్తోందన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని, వర్సిటీలో పలు కీలక పదవుల్లో మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. 

హోదాలు మరిచి.. హాయిగా
ఈ సమ్మేళనం సందర్భంగా వర్సిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన ఎందరో పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖులు తమ హోదాలను పక్కనపెట్టి సాధారణ విద్యార్థుల్లా మారిపోయారు. క్యాంపస్‌లో కలియతిరుగుతూ, టీ స్టాల్ వద్ద కబుర్లు చెప్పుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో ఏయూ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సావనీర్‌ను ఆవిష్కరించారు. సుధామూర్తిని, వర్సిటీకి చేయూతనిచ్చిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించారు.


More Telugu News