Potturi Sravanthi: నెల్లూరు మేయర్ పదవికి స్రవంతి రాజీనామా

Potturi Sravanthi Resigns as Nellore Mayor Amidst Controversy
  • అవిశ్వాస వివాదానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటన
  • నాపై కుట్ర చేసిన వారికి ఉసురు తగులుతుందంటూ ఆవేదన
  • మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిపై స్రవంతి భర్త తీవ్ర వ్యాఖ్యలు
నెల్లూరు నగరపాలక సంస్థలో గత కొంతకాలంగా కొనసాగుతున్న అవిశ్వాస వివాదానికి మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాతో తెరపడింది. తనపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె నిన్న రాత్రి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఆదివారం తన రాజీనామా లేఖను కలెక్టర్ హిమాన్షు శుక్లాకు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా స్రవంతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనను పదవి నుంచి దించేందుకు కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన స్రవంతి.. కార్పొరేటర్లపై దాడులకు పాల్పడుతూ, మహిళా కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మేయర్ పదవి ఇచ్చింది సీఎం జగన్మోహన్‌రెడ్డి అని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. తాను పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, ప్రజాసేవలో కొనసాగుతానని వెల్లడించారు. తనపై కుట్ర పన్నిన వారికి ఉసురు కచ్చితంగా తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు.

అనంతరం ఆమె భర్త జయవర్ధన్ మాట్లాడుతూ టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన అర్ధాంగి దెబ్బకు టీడీపీ ప్రజాప్రతినిధులు భయపడుతున్నారన్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, టీడీపీ నేతలు గిరిధర్‌రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డిల రాజకీయ అంతం చూసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. రేకుల షెడ్డులో ట్యూషన్ చెప్పిన నారాయణ వందల కోట్లు ఎలా సంపాదించాడో త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. ఈ పరిణామంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 
Potturi Sravanthi
Nellore Mayor
Nellore Municipal Corporation
Resignation
YSRCP
Jagan Mohan Reddy
Jayavardhan
Minister Narayana
MLA Sridhar Reddy
Telugu Desam Party

More Telugu News