కోల్‌కతాలో మెస్సి ఈవెంట్ రసాభాస.. గంగూలీ మాట వినకుండానే వెళ్లిపోయిన మెస్సి

  • కోల్‌కతాలో మెస్సీ కార్యక్రమం తీవ్ర గందరగోళం
  • భద్రతా కారణాలతో మధ్యలోనే వెళ్లిపోయిన మెస్సి
  • సౌరవ్ గంగూలీ విజ్ఞప్తిని తిరస్కరించిన మెస్సి బృందం
  • ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్తా అరెస్ట్
  • టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని చెప్పి పోస్ట్ డిలీట్
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో శనివారం జరిగిన ‘గోట్ టూర్’ కార్యక్రమం తీవ్ర గందరగోళానికి, రసాభాసకు దారితీసింది. భద్రతా లోపం తలెత్తే సూచనలు కనిపించడంతో మెస్సి కార్యక్రమం మధ్యలోనే నిష్క్రమించారు. అనంతరం ఈ ఘటనకు బాధ్యుడిగా భావిస్తున్న ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్తాను పోలీసులు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.

అధిక ధరలకు టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ, మైదానంలో ఉన్న జనం అడ్డుగా ఉండటంతో తమకు మెస్సి కనిపించడం లేదంటూ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే గ్యాలరీలో అశాంతి చెలరేగి, స్టేడియంలోకి బాటిళ్లు విసరడం మొదలుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన మెస్సి బృందం వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.

ఆ సమయంలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నిర్వాహకుడు శతద్రు దత్తా మరికొంత సేపు ఉండాలని మెస్సిని కోరారు. అయితే, భద్రతాపరమైన అంశాలలో రాజీపడేది లేదని స్పష్టం చేసిన మెస్సి బృందం వారి విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించింది. తన సహచరులు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్‌లతో కలిసి మెస్సి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

అంతకుముందు మెస్సి మైదానంలో గడిపింది కేవలం 20 నిమిషాలే. ఆ సమయంలో కూడా ఆయన చుట్టూ మంత్రులు, వీఐపీలు, సిబ్బంది ఉండటంతో అభిమానులు ఆయన్ను సరిగా చూడలేకపోయారు. ఈ ఘటన తర్వాత, టికెట్ డబ్బులు వాపసు ఇస్తానని శతద్రు దత్తా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి, కాసేపటికే దాన్ని తొలగించారు. అనంతరం హైదరాబాద్ వెళ్లేందుకు కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News