Rajkumar Goyal: కేంద్ర సమాచార కమిషన్‌కు కొత్త చీఫ్.. రాజ్‌కుమార్‌ గోయల్ నియామకం

Rajkumar Goyal Appointed as Central Information Commission Chief
  • ఏపీకి చెందిన సుధారాణి సహా 8 మంది కొత్త కమిషనర్లు
  • 9 ఏళ్ల తర్వాత పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరిన కమిషన్
  • కమిషన్‌లో ముగ్గురు మహిళలకు చోటు
  • నియామకాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసమ్మతి
కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) నూతన ప్రధాన కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్‌ గోయల్ నియమితులయ్యారు. ఆయనతో పాటు మరో 8 మందిని కమిషనర్లుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ నియామకాలు జరిగాయి.

కొత్తగా నియమితులైన వారిలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి రేలంగి వంటి ప్రముఖులు ఉన్నారు. సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాజ్‌కుమార్‌ గోయల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నియామకాలతో సీఐసీలో ఖాళీగా ఉన్న చీఫ్‌ సహా మొత్తం 9 పోస్టులు భర్తీ అయ్యాయి. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత కమిషన్ పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయనుండటం గమనార్హం.

గత ఏడాది సెప్టెంబర్‌లో చీఫ్ కమిషనర్ హీరాలాల్ సమరియా పదవీ విరమణ చేయగా, మిగిలిన కమిషనర్ల పోస్టులు 2023 నవంబర్ నుంచి ఖాళీగా ఉన్నాయి. అయితే, ఈ నియామకాల ఎంపిక ప్రక్రియపై విపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపిస్తూ ఆయన కమిటీ సమావేశంలో అసమ్మతి నోట్ సమర్పించారు.

ఏపీ మహిళ సుధారాణి నేపథ్యం
కమిషనర్‌గా ఎంపికైన సుధారాణి రేలంగి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. న్యాయరంగంలో 35 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె గతంలో సీబీఐ ప్రాసిక్యూషన్ డైరెక్టర్‌గా, కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ప్రస్తుతం ఆమె పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ)లో సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Rajkumar Goyal
Central Information Commission
CIC
Sudha Rani Relangi
Information Commissioner
Droupadi Murmu
Heeralal Samariya
Rahul Gandhi
Appointments
India

More Telugu News