అఖండ 2’ చిత్రం అఖండ విజయం సాధించాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

  • ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కలిసిన దర్శకుడు బోయపాటి
  • అఖండ 2 చిత్రాన్ని ప్రశంసించిన మోహన్ భగవత్
  • దేశం, ధర్మం గొప్పదనం చాటిచెప్పారన్న ఆర్ఎస్ఎస్ చీఫ్
  • భగవత్ ఆశీస్సులు గొప్ప గౌరవమన్న బోయపాటి
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2: తాండవం’ చిత్రంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్ భగవత్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను.. మోహన్ భగవత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ‘అఖండ 2’ చిత్రం గురించి ఆయన మాట్లాడారు. దేశం, ధర్మం, దైవం గొప్పదనాన్ని, సనాతన ధర్మ వైభవాన్ని నేటి తరానికి అద్భుతంగా చూపించారని బోయపాటిని అభినందించారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఇలాంటి విలువలతో కూడిన చిత్రాలు మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు.

మోహన్ భగవత్ ప్రశంసలపై దర్శకుడు బోయపాటి శ్రీను స్పందించారు. "దేశం, ధర్మం వంటి మూల విలువలను నేటి తరానికి తెలియజేయాలనే లక్ష్యంతోనే ఈ చిత్రాన్ని రూపొందించాం. మోహన్ భగవత్ గారి ఆశీస్సులు మా చిత్ర బృందానికి దక్కిన గొప్ప గౌరవం. ఇది మాకు మరింత స్ఫూర్తిని, బాధ్యతను పెంచింది" అని పేర్కొన్నారు.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ 2’ చిత్రం ఇప్పటికే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది.


More Telugu News