Pawan Kalyan: అంధ క్రికెటర్ల వేదనకు స్పందన... 24 గంటల్లోనే టీవీ, ఫ్యాన్, ఇతర వస్తువులు పంపించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan responds to blind cricketers plight
  • వరల్డ్ కప్ గెలిచిన భారత అంధుల మహిళల జట్టు
  • నిన్న అమరావతిలో పవన్ కల్యాణ్ ను కలిసిన జట్టు సభ్యులు
  • తెలుగు క్రికెటర్ల పరిస్థితి విని చలించిపోయిన పవన్ కల్యాణ్
  • వెంటనే సాయం అందించిన వైనం
 అంధుల క్రికెట్‌లో ప్రపంచ విజేతలుగా నిలిచిన భారత జట్టులోని తెలుగు క్రీడాకారిణుల కుటుంబాల దైన్యస్థితి గురించి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. వారి కష్టాలకు తక్షణమే స్పందించి, కేవలం 24 గంటల వ్యవధిలోనే వారికి అండగా నిలిచారు. వ్యక్తిగతంగా గృహోపకరణాలు, నిత్యావసరాలు అందించడమే కాకుండా, ప్రభుత్వపరంగా మౌలిక సదుపాయాల కల్పనకు గంటల వ్యవధిలోనే ఆదేశాలు జారీ చేసి తన మానవత్వాన్ని, పరిపాలన దక్షతను చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే...!
శుక్రవారం నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను అంధుల మహిళా క్రికెట్ జట్టు సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక, మరో సభ్యురాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన పాంగి కరుణ కుమారి తమ కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మ్యాచ్ ఫీజుతోనే తమ కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామని దీపిక చెప్పిన మాటలకు పవన్ కల్యాణ్ కదిలిపోయారు. వెంటనే వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

గంటల వ్యవధిలోనే సాయం..!
వెంటనే తన సిబ్బందిని ఆదేశించి, రెండు కుటుంబాలకు అవసరమైన టీవీలు, టేబుల్ ఫ్యాన్లు, మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్లు, పాత్రలు, దుప్పట్లు, కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు, నెలరోజులకు సరిపడా నిత్యావసర సరకులు వంటివి సమకూర్చారు. ఈ సామగ్రిని జనసేన నాయకుల ద్వారా శ్రీ సత్యసాయి జిల్లా తంబలహట్టి తండాలోని దీపిక కుటుంబానికి, ఏఎస్ఆర్ జిల్లా వంట్ల మామిడిలోని కరుణ కుమారి కుటుంబానికీ శనివారం ఉదయానికల్లా చేర్చారు. జనసేన నాయకులు స్వయంగా వారి గ్రామాలకు వెళ్లి ఈ వస్తువులను అందజేశారు.

మాట ఇచ్చి... గంటల్లోనే రోడ్లు మంజూరు
భేటీ సందర్భంగా కెప్టెన్ దీపిక తమ గ్రామమైన తంబలహట్టి తండాకు వెళ్లే రెండు ప్రధాన రహదారులు అధ్వానంగా ఉన్నాయని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ విషయం తెలుసుకున్న ఆయన, సాయంత్రానికల్లా స్పందించారు. శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించి, రెండు రోడ్ల నిర్మాణానికి రూ.6.2 కోట్లు మంజూరు చేయించారు. హేమావతికి వెళ్లే రహదారికి రూ. 3.2 కోట్లు, గున్నేహళ్లికి వెళ్లే రోడ్డుకు రూ. 3 కోట్లు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ పాలనాపరమైన అనుమతులు జారీ చేశారు.

ఈ ఇద్దరు మహిళా క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కూడా పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక, వాటికి అవసరమైన ఫర్నిచర్ కూడా సమకూర్చాలని తన పేషీ సిబ్బందికి సూచించారు. సమస్య చెప్పిన గంటల వ్యవధిలోనే స్పందించి, తక్షణ పరిష్కారం చూపిన పవన్ కల్యాణ్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Pawan Kalyan
Pawan Kalyan response
Blind cricketers
Indian blind women cricket team
Deepika
Pangi Karuna Kumari
Andhra Pradesh roads
Srisatya Sai district
Alluri Sitarama Raju district
Deputy CM Andhra Pradesh

More Telugu News