VenkY Kudumula: నిర్మాతగా మారిన మరో టాలీవుడ్ దర్శకుడు

VenkY Kudumula Turns Producer with What Next Entertainments
  • నిర్మాతగా కొత్త అవతారం ఎత్తిన దర్శకుడు వెంకీ కుడుముల
  • ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ పేరుతో సొంత బ్యానర్ స్థాపన
  • కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే తన లక్ష్యమని వెల్లడి
  • తొలి చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్
  • డిసెంబర్ 14న టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్ లో కొందరు దర్శకులు కాలక్రమంలో నిర్మాతలుగా మారడం తెలిసిందే. తనదైన కామెడీ టైమింగ్, యూత్‌ఫుల్ కథలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల కూడా ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించారు. ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ పేరుతో ఆయన తన సొంత నిర్మాణ సంస్థను అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్‌పై కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో తన తొలి చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ విషయాన్ని వెంకీ కుడుముల తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. తన తొలి ప్రయత్నానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. ఈ చిత్రానికి మహేశ్ ఉప్పల అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించనుండగా, మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను డిసెంబర్ 14న (#NewGuyInTown) విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ, "సినిమా అంటే నాకు అమితమైన ఇష్టం. ఈ రంగంలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అందుకే, అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త ప్రతిభావంతులకు, చెప్పాలనుకుంటున్న మంచి కథలకు ఒక వేదికను అందించాలనే ఉద్దేశంతోనే ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ను ప్రారంభించాను. ఒక్కరికి నా ద్వారా అవకాశం లభించినా అది నాకు గొప్ప విజయం" అని అన్నారు.

కేవలం వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడమే కాకుండా, పరిశ్రమకు కొత్త ఆలోచనలు, ప్రతిభను పరిచయం చేసే లక్ష్యంతో వెంకీ కుడుముల ఈ నిర్మాణ సంస్థను స్థాపించినట్లు తెలుస్తోంది.
VenkY Kudumula
What Next Entertainments
Telugu cinema
Tollywood director
Movie production
Mahesh Uppala
Anaswara Rajan
Thaman
Raja Mahadevan
New Guy In Town

More Telugu News