Ashwini Vaishnaw: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే శాఖ కీలక నిర్ణయం

Ashwini Vaishnaw Announces Local Cuisine on Vande Bharat Trains
  • వందే భారత్ రైళ్లలో స్థానిక వంటకాలు అందిస్తామన్న అశ్విని వైష్ణవ్
  • భవిష్యత్తులో అన్ని రైళ్లకు ఈ విధానాన్ని విస్తరించనున్నట్లు వెల్లడి
  • టికెట్ బుకింగ్‌లో మోసాలకు అడ్డుకట్ట.. 3.03 కోట్ల నకిలీ ఐడీలు రద్దు
  • తత్కాల్ టికెట్ల కోసం ఆధార్ ఓటీపీ విధానంతో పెరిగిన లభ్యత
  • నిజమైన ప్రయాణికులకు సులువుగా టికెట్లు అందేలా చర్యలు
వందే భారత్ రైళ్లలో ఇకపై ప్రయాణికులకు స్థానిక వంటకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం రైల్ భవన్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రైళ్లు ప్రయాణించే ప్రాంతాల సంస్కృతి, రుచులను ప్రతిబింబించేలా ఆహారాన్ని అందించడం ద్వారా ప్రయాణికుల అనుభూతిని మెరుగుపరచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తొలుత వందే భారత్ రైళ్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి, భవిష్యత్తులో దశలవారీగా అన్ని రైళ్లకు విస్తరిస్తామని స్పష్టం చేశారు.

మరోవైపు, నకిలీ గుర్తింపు కార్డులతో రైలు టికెట్లు బుక్ చేసే వారిపై ఉక్కుపాదం మోపినట్లు మంత్రి తెలిపారు. ఫేక్ ఐడీలను గుర్తించేందుకు పటిష్టమైన వ్యవస్థను ప్రవేశపెట్టిన తర్వాత సానుకూల ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల ఫలితంగా ఇప్పటివరకు 3.03 కోట్ల నకిలీ ఖాతాలను శాశ్వతంగా రద్దు చేశామని, మరో 2.7 కోట్ల ఐడీలను అనుమానాస్పద కార్యకలాపాల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశామని వివరించారు. గతంలో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రోజుకు లక్ష వరకు కొత్త యూజర్ ఐడీలు నమోదయ్యేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 5,000కు పడిపోయిందని తెలిపారు.

సాధారణ ప్రయాణికులు సులువుగా టికెట్లు బుక్ చేసుకునేలా టికెటింగ్ వ్యవస్థను సంస్కరించాలని అధికారులను మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు. ఇప్పటికే తత్కాల్ టికెట్ల బుకింగ్‌లో పారదర్శకత కోసం ఆధార్ ఆధారిత ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టామని, దీనివల్ల కన్ఫర్మ్ టికెట్ల లభ్యత సమయం గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
Ashwini Vaishnaw
Vande Bharat Express
Indian Railways
Local Cuisine
Railway Minister
IRCTC
Fake ID
Train Tickets
Tatkal Tickets
Railway Reforms

More Telugu News