Purandeswari: రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతం: పురందేశ్వరి

Purandeswari says NTR imprint permanent in politics
  • ఎన్టీఆర్ చారిత్రక పోరాటానికి స్వర రూపం.. ఘనంగా ఆడియో బుక్ విడుదల
  • హాజరైన ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి
  • ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనదని వెల్లడి
  • సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు నిలిచిపోతుందని ఉద్ఘాటన
రాష్ట్ర, దేశ రాజకీయాల్లో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ముద్ర శాశ్వతమైనదని, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని చారిత్రక ఘట్టమైన '1984 ఆగస్టు ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం'పై విక్రమ్ పూల రచించిన 'సజీవ చరిత్ర' పుస్తకం ఆడియో వెర్షన్ ను ఆమె ఆవిష్కరించారు. జయప్రద ఫౌండేషన్, టీడీ జనార్దన్ నేతృత్వంలోని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సంయుక్తంగా శనివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో (FNCC) ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాయి.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పురందేశ్వరి మాట్లాడుతూ, 1984 నాటి పరిరక్షణోద్యమం కేవలం ఎన్టీఆర్ జీవితంలోనే కాక, దేశ రాజకీయాల్లోనూ ఒక కీలక మలుపు అని అభివర్ణించారు. ఆనాడు పార్టీ ఫిరాయింపులు, ప్రభుత్వాలను కూల్చే అనైతిక చర్యలు సర్వసాధారణంగా ఉండేవని, కానీ ఎన్టీఆర్ చేసిన పోరాటం వల్లే దేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం (1985 నాటి 52వ రాజ్యాంగ సవరణ) అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. 

పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో, ఆయన పేరిట నాణెం విడుదల చేయించడంలో తన వంతు కృషి చేసి, తండ్రి రుణం కొంతమేర తీర్చుకోగలిగానని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ భావజాలాన్ని వ్యాపింపజేస్తున్న లిటరేచర్ కమిటీ సభ్యులను, చైర్మన్ టీడీ జనార్దన్‌ను ఆమె అభినందించారు.

కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ స్వాగతోపన్యాసం చేస్తూ, తెలుగునాట రాజకీయాలను 'ఎన్టీఆర్‌కు ముందు, ఎన్టీఆర్ తర్వాత' అని చూడాల్సి ఉంటుందని అన్నారు. ఎందరో ముఖ్యమంత్రులు పాలించినా, ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఒక్క ఎన్టీఆర్ మాత్రమేనని చెప్పారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను భావి తరాలకు అందించే లక్ష్యంతో కమిటీని ఏర్పాటు చేశామని, ఇప్పటికే పలు పుస్తకాలు ప్రచురించామని, 'అన్న ఎన్టీఆర్' యూట్యూబ్ ఛానల్ ప్రారంభించామని తెలిపారు. ఎన్టీఆర్ పేరును అజరామరం చేయడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అతి సామాన్యుడైన తనను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు. పేదవాడి ఆకలి తెలిసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన తన గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని తెలిపారు.

ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ, 1984 నాటి క్లిష్ట పరిస్థితులను వివరించారు. ఒకవైపు తల్లి క్యాన్సర్‌తో బాధపడుతుంటే, మరోవైపు తండ్రి అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చిన వెంటనే పదవి నుంచి దించారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు విశ్రాంతి సూచించినా లెక్కచేయకుండా, ప్రజాస్వామ్యం కోసం ఆయన పోరాడిన తీరును స్మరించుకున్నారు.

కార్యక్రమం ప్రారంభంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, 'మా తెలుగు తల్లికి' గీతాన్ని ఆలపించారు. రచయిత విక్రమ్ పూల పుస్తక విశేషాలను సభకు పరిచయం చేశారు. ఈ ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన గాయత్రిని పురందేశ్వరి, టీడీ జనార్దన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత కేఎస్ రామారావు, నందమూరి రామకృష్ణ, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Purandeswari
NTR
Nandamuri Taraka Rama Rao
1984 August movement
Vikram Poola
TD Janardhan
Telugu Desam Party
Motkupalli Narasimhulu
Nandamuri Ramakrishna
Telugu politics

More Telugu News