Harish Rao: తెలంగాణ ప్రజలు ఓటుతోనే గుణపాఠం చెప్పారు: ఎమ్మెల్యే హరీశ్ రావు

Harish Rao Slams Congress Party After Panchayat Election Results in Telangana
  • డబ్బు సంచులతో ప్రలోభ పెట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ
  • ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు చూశారన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని వ్యాఖ్య
అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికలకు తెలంగాణ ప్రజలు ఓటుతోనే గుణపాఠం చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మెదక్ జిల్లాలోని పాపన్నపేట, ఘనపూర్ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన 26 మంది నూతన సర్పంచులు ఈరోజు హరీశ్ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హరీశ్ రావు వారిని శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డబ్బు సంచులతో ప్రలోభపెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారని అన్నారు. నామినేషన్ల దశ నుంచే బీఆర్ఎస్ మద్దతుదారు అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఏకగ్రీవాల పేరుతో బెదిరించినప్పటికీ తమ కార్యకర్తలు, నాయకులు గులాబీ జెండాను వదలలేదని, ఈ గెలుపు బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. పైగా కేసీఆర్ ఇస్తున్న పథకాలకు కోతలు పెట్టారని, ఈ మోసాన్ని ప్రజలందరూ గమనించారని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని అన్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో మన అభ్యర్థులు, గిరిజన బిడ్డలు సర్పంచులుగా గెలవడం చాలా సంతోషకరమని అన్నారు.

ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారని అన్నారు. ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ బీఆర్ఎస్ మద్దతుదారులు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి సాధించుకుందామని అన్నారు.
Harish Rao
Telangana
BRS Party
Congress Party
Panchayat Elections
Medak District

More Telugu News