Mihir Shah: ఇలాంటి అబ్బాయిలకు గుణపాఠం నేర్పించాలి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Mihir Shah Bail Rejected Supreme Court Remarks in BMW Hit and Run Case
  • హిట్ అండ్ రన్ కేసు
  • స్కూటీపై వస్తున్న వారిని కారుతో ఢీకొట్టిన శివసేన నేత కుమారుడు
  • బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసిన మిహిర్ షా
  • చేసిన నేరానికి అతడు కొద్దిరోజులు జైల్లోనే ఉండాలన్న సుప్రీంకోర్టు
2024 ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మిహిర్ షా బెయిల్ పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. "ఈ యువకులకు గుణపాఠం నేర్పించాలి" అని వ్యాఖ్యానించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుడు మిహిర్ షా వేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు నిరాకరించింది.

హిట్ అండ్ రన్ కేసులో బైక్‌పై వస్తున్న వారిని అతివేగంతో కారుతో ఢీకొట్టడమే కాకుండా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. చేసిన నేరానికి గాను అతడు కొంతకాలం జైల్లోనే ఉండాలని ఆదేశించింది.

ముంబైలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేశ్ షా కుమారుడు మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళుతున్న స్కూటీని ఢీకొట్టడంతో దంపతులు ఎగిరి కిందపడ్డారు. వేగంగా వెళుతున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన తర్వాత మిహిర్ ఘటన స్థలానికి కొద్దిదూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
Mihir Shah
Mumbai BMW hit and run case
Supreme Court
Bail petition

More Telugu News