Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళంపై ఏఐఎఫ్ఎఫ్ ప్రకటన

Lionel Messi Kolkata Event AIFF Statement on Chaos
  • కోల్‌కతా మెస్సీ ఈవెంట్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఏఐఎఫ్ఎఫ్
  • ఇది ఓ ప్రైవేట్ పీఆర్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమమని వెల్లడి
  • తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ప్రకటన
  • ఘటనపై విచారణకు జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటు చేసిన బెంగాల్ సీఎం
కోల్‌కతాలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొన్న కార్యక్రమంలో జరిగిన గందరగోళం, నిర్వాహణ లోపాలపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమమని, దీని గురించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తేల్చిచెప్పింది.

"వివేకానంద యువ భారతి క్రీడాంగణంలో జరిగిన పరిణామాలపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఇది ఒక ప్రైవేట్ పీఆర్ ఏజెన్సీ నిర్వహించిన కార్యక్రమం. దీని ప్రణాళిక, నిర్వహణ లేదా అమలులో ఏఐఎఫ్ఎఫ్‌కు ఎలాంటి పాత్ర లేదు. ఈ కార్యక్రమ వివరాలను మాకు తెలియజేయలేదు, మా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు" అని ఏఐఎఫ్ఎఫ్ సోషల్ మీడియాలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

మెస్సీ తన 'గోట్ టూర్'లో భాగంగా సహచర అర్జెంటీనా ఆటగాడు రోడ్రిగో డి పాల్‌, ఉరుగ్వే సాకర్ స్టార్ లూయిస్ సువారెజ్ తో కలిసి కోల్‌కతా వచ్చాడు. తమ అభిమాన ఆటగాడిని చూసేందుకు వేలాది మంది అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియానికి తరలివచ్చారు. అయితే, అధిక టికెట్ ధరలు, మెస్సీని చూసేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడంతో అభిమానుల ఉత్సాహం నిరాశగా మారింది. ఇది కాస్తా తీవ్ర గందరగోళానికి, విధ్వంసానికి దారితీసింది.

ఈ పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ ఘటనకు దారితీసిన నిర్వాహణ లోపాలపై విచారణ జరిపేందుకు కలకత్తా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ ఘటనతో అంతర్జాతీయ స్టార్లతో కూడిన కార్యక్రమాలకు భద్రత, జన నియంత్రణ అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
Lionel Messi
Messi Kolkata event
AIFF
All India Football Federation
Salt Lake Stadium
Mamata Banerjee
Argentina football
Rodrigo De Paul
Luis Suarez

More Telugu News