Shivraj Singh Chouhan: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు ఐఎస్ఐ ముప్పు... భద్రత పెంపు

Shivraj Singh Chouhan faces ISI threat security increased
  • కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను టార్గెట్ చేసిన ఐఎస్ఐ
  • మధ్యప్రదేశ్ డీజీపీకి లేఖ రాసిన కేంద్ర హోం శాఖ
  • ప్రస్తుతం ఉన్న జెడ్ ప్లస్ భద్రతను మరింత కట్టుదిట్టం
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో, ఆయనకు కల్పిస్తున్న జెడ్ ప్లస్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఐఎస్ఐ లక్ష్యంగా చేసుకుందని, ఆయన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించామని పేర్కొంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్ డీజీపీకి ఒక లేఖ పంపింది. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, భోపాల్‌లోని ఆయన నివాసం వద్ద భద్రతను సమీక్షించి, పటిష్ఠం చేశారు. ప్రస్తుతం ఉన్న భద్రతకు అదనంగా మరికొంతమంది సిబ్బందిని మోహరించారు.

అయితే, ఈ హెచ్చరికల నేపథ్యంలోనూ శివరాజ్ సింగ్ చౌహాన్ తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శనివారం భోపాల్‌లోని స్మార్ట్ సిటీ పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిరోజూ మొక్కలు నాటాలనే తన సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టానని, పచ్చదనం పెంచేందుకు అందరూ కలిసి రావాలని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

భారత్‌లో జెడ్ ప్లస్ కేటగిరీ అత్యంత కట్టుదిట్టమైన భద్రతగా పరిగణిస్తారు. దీని కింద 10 మందికి పైగా ఎన్ఎస్‌జీ కమాండోలతో పాటు, మొత్తం 55 మంది శిక్షణ పొందిన సిబ్బంది ఒక వ్యక్తి భద్రతా విధుల్లో ఉంటారు. ఈ కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లోనూ నిష్ణాతులు.
Shivraj Singh Chouhan
ISI threat
Z Plus security
Central Minister
Madhya Pradesh
Intelligence agencies
Home Ministry
Pakistan spy agency

More Telugu News