Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు

Indigo Airlines Operations Recovered Over 2000 Flights Operated
  • సాధారణ స్థితికి ఇండిగో సేవలు
  • వరుసగా రెండో రోజు 2000కి పైగా విమానాలు నడిపిన ఇండిగో
  • ఇటీవలి అంతరాయాల తర్వాత కార్యకలాపాలు సాధారణ స్థితికి
  • సమస్యల విచారణకు స్వతంత్ర ఏవియేషన్ కన్సల్టెన్సీ నియామకం
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరుసగా రెండో రోజు కూడా 2000కి పైగా విమానాలను నడిపినట్లు శనివారం కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయాలు ఏర్పడి, దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.

గత ఐదు రోజులుగా తమ కార్యకలాపాలు నిలకడగా కొనసాగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సవరించిన షెడ్యూల్ ప్రకారం రోజుకు 2 వేలకు పైగా విమానాలను నడుపుతున్నట్లు ఇండిగో తెలిపింది. సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం 138 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని, సమయపాలన కూడా సాధారణ స్థాయికి చేరిందని పేర్కొంది.

డిసెంబర్ 8న 1,700కి పైగా విమానాలు నడిపిన ఇండిగో, ఆ సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది. డిసెంబర్ 12న 2,050కి పైగా విమానాలను ఆపరేట్ చేయగా, కేవలం రెండు సర్వీసులు మాత్రమే సాంకేతిక కారణాలతో రద్దయ్యాయని కంపెనీ వివరించింది. డిసెంబర్ 13న కూడా 2,050కి పైగా విమానాలు నడవనున్నట్లు అంచనా వేసింది. కార్యకలాపాలలో వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించడానికి ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌సీ’ అనే స్వతంత్ర కన్సల్టెన్సీని నియమించినట్లు తెలిపింది.

Indigo Airlines
Indigo flights
Indian aviation
Flight operations
Airline schedule
Flight disruptions
Aviation industry
Domestic flights
Airport delays
Chief Aviation Advisors LLC

More Telugu News