Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్

Vizag to be developed as Knowledge Economy Hub says Vasamshetti Subhash
  • కాగ్నిజెంట్ రాకతో వేలాదిగా ఉద్యోగావకాశాలన్న మంత్రి
  • గత ప్రభుత్వ హయాంలో విశాఖ గంజాయి హబ్‌గా మారిందని విమ‌ర్శ‌
  • అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ అసత్య ప్రచారం చేస్తుంద‌న్న వాసంశెట్టి సుభాశ్ 
సీఎం చంద్రబాబు నేతృత్వంలో విశాఖపట్నం నగరాన్ని నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా, ఐటీ-పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఇటీవల విశాఖలో ప్రారంభమైన కాగ్నిజెంట్ సంస్థ ద్వారా వేలాది ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.

ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో విశాఖను గంజాయి, ఫ్యాక్షనిజం కేంద్రంగా మార్చారని ఆయన ఆరోపించారు. కాగితాలపై పెట్టుబడులు చూపించి, నకిలీ పెట్టుబడిదారుల పేరుతో భూములు కేటాయించే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ విధానాల వల్లే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు.

మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్‌పై అసత్య ప్రచారం చేస్తూ కోటి సంతకాలు సేకరించడం రాజకీయంగా హాస్యాస్పదంగా ఉందని సుభాశ్ అన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట విమర్శలు చేయడం తగదని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి సభలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత తీసుకొచ్చామని మంత్రి వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, సీఎం చంద్రబాబు ప్రతి పెట్టుబడిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కల్పిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు సహించరని ఆయన స్పష్టం చేశారు.
Vasamshetti Subhash
Visakhapatnam
Knowledge Economy
IT Hub
Andhra Pradesh
Cognizant
Investments
Bhogapuram Airport
TDP
YS Jagan

More Telugu News