Robin Uthappa: రెండో టీ20లో టీమిండియా ఓటమి.. రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు

Robin Uthappa comments on Indias defeat in 2nd T20
  • సూర్యకుమార్ అనుసరిస్తున్న విధానం తనకు నచ్చలేదన్న ఊతప్ప
  • భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు మంచి బ్యాటర్లను బరిలోకి దించాలని వ్యాఖ్య
  • ప్రారంభంలో వికెట్లు కోల్పోయినప్పుడు నిలకడగా ఆడే ఆటగాడు అవసరమన్న ఊతప్ప
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం కూడా జట్టు ఓటమికి ఒక కారణమని మాజీ క్రికెటర్లు భావిస్తున్నారు. మ్యాచ్ ఓటమిపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప స్పందిస్తూ, సూర్యకుమార్ యాదవ్ అనుసరించిన విధానం తనకు నచ్చలేదని అన్నాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఉత్తమ బ్యాటర్లను ముందుగా పంపాలని అభిప్రాయపడ్డాడు.

లోయర్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే ఆటగాడిని టాప్ ఆర్డర్‌కు ప్రమోట్ చేస్తే అతను చెలరేగి ఆడాలని ఊతప్ప పేర్కొన్నాడు. రెండో టీ20లో అక్షర్ పటేల్ అలా వచ్చి 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడని తెలిపాడు. హిట్టింగ్‌కు ప్రయత్నించి వికెట్ కోల్పోయినా పర్వాలేదు కానీ, పరుగులు రాబట్టలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. అక్షర్ పటేల్‌ను టాప్ ఆర్డర్‌లో పంపాలనే సూర్యకుమార్ యాదవ్ నిర్ణయం తనకు నచ్చలేదని స్పష్టం చేశాడు.

మొదటి లేదా రెండో ఓవర్‌లో వికెట్ కోల్పోయినప్పుడు నిలకడగా ఆడే ఆటగాడు అవసరమని ఊతప్ప అన్నాడు. ఇక్కడ ఏదో పొరపాటు జరుగుతోందని, ఇది అలవాటుగా మారకముందే టీమిండియా దీనిని సరిదిద్దుకోవాలని సూచించాడు. మొదట బ్యాటింగ్ చేసినా, లక్ష్య ఛేదనకు దిగినా మొదటి ముగ్గురు బ్యాటర్లను పదేపదే మార్చకూడదని అభిప్రాయపడ్డాడు. ఇవి కీలక స్థానాలని, సరైన సందర్భంలో మాత్రమే పించ్ హిట్టర్‌ను ఉపయోగించాలని వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్‌కు ముందు ఎక్కువ ప్రయోగాలు చేయడం జట్టుకు నష్టం చేకూరుస్తుందని హెచ్చరించాడు.
Robin Uthappa
India vs South Africa
T20 World Cup
Axar Patel
Suryakumar Yadav

More Telugu News