Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే!

Amaravati Land Pooling Pemmasani Warns of Land Acquisition Next Month
  • అమరావతి రైతుల సమస్యలపై త్రిసభ్య కమిటీ కీలక సమావేశం
  • ల్యాండ్ పూలింగ్‌కు భూములివ్వని రైతులతో మరోసారి చర్చలు
  • సమీకరణ కుదరకపోతే వచ్చే నెలలో భూసేకరణ నోటిఫికేషన్
  • ప్లాట్ల విషయంలో ప్రతినెలా వాస్తు మార్పులు సాధ్యం కాదన్న కేంద్రమంత్రి
రాజధాని అమరావతి రైతులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. ఈ అంశంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక విషయాలు వెల్లడించారు. ల్యాండ్ పూలింగ్‌కు ఇప్పటికీ భూములు ఇవ్వని రైతులతో మరోసారి చర్చలు జరుపుతామని, ఒకవేళ వారు అంగీకరించకపోతే వచ్చే నెల మొదటి వారంలో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన పెమ్మసాని, సుమారు 2,400 ఎకరాల భూమి ఇంకా ల్యాండ్ పూలింగ్‌ పరిధిలోకి రాలేదని తెలిపారు. వీధిపోటు వంటి సమస్యలున్న ప్లాట్లకు ఒకసారి మార్పులు చేసే అవకాశం కల్పిస్తామని రైతులకు సూచించారు. అయితే, "ప్రతి నెలా వాస్తు మార్పులు చేయడం సాధ్యం కాదు. సమస్యలు ఉన్నవారు ఒకేసారి వచ్చి పరిష్కరించుకోవాలి" అని ఆయన తేల్చి చెప్పారు. జరీబు భూముల సమస్య పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని, సాయిల్ టెస్ట్ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

తాడికొండ బైపాస్ నిర్మాణం వల్ల నష్టపోయిన రైతులకు టీడీఆర్ బాండ్లు అందజేస్తామని పెమ్మసాని భరోసా ఇచ్చారు. హెల్త్ కార్డుల అంశంపై గ్రామసభలు నిర్వహించి నిర్ణయిస్తామని చెప్పారు. గ్రామాల్లో డీపీఆర్ ప్రకారం మౌలిక సదుపాయాల కల్పన, ఎల్‌పీఎస్ ప్రాంతాల్లో సరిహద్దు రాళ్ల ఏర్పాటు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న 18 కమ్యూనిటీ హాళ్లు, శ్మశానాల పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. 
Pemmasani Chandrasekhar
Amaravati farmers
Andhra Pradesh capital
Land pooling
Land acquisition
Farmers issues
TDP
Central government
Rural development
Tadikonda bypass

More Telugu News