SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు

SBI Cuts Home and Auto Loan Interest Rates
  • వివిధ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ
  • గృహ, వాహన, ఎంఎస్‌ఎంఈ రుణాలపై తగ్గనున్న భారం
  • ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్ల కోత
  • ఈ నెల‌ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త రేట్లు
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. పలు కీలక రుణ రేట్లతో పాటు ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు ఈ నెల‌ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈ నిర్ణయంతో గృహ, వాహన, ఎంఎస్‌ఎంఈ రుణాల ఈఎంఐల భారం తగ్గనుంది. అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్‌ఆర్)ను 5 బేసిస్ పాయింట్ల మేర ఎస్‌బీఐ తగ్గించింది. దీంతో ఏడాది కాలపరిమితి గల ఎంసీఎల్ఆర్ 8.70 శాతానికి చేరింది. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్‌ఆర్)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.90 శాతంగా నిర్ణయించింది. పాత రుణ గ్రహీతలకు వర్తించే బేస్ రేటును కూడా 10.00 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గించింది.

మరోవైపు రూ.3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను సవరించింది. 2 నుంచి 3 ఏళ్లలోపు డిపాజిట్లపై వడ్డీని 6.45 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించింది. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలపరిమితిపై వడ్డీ రేటు 6.95 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గింది. ప్రజాదరణ పొందిన ‘అమృత్ వృష్టి’ 444-రోజుల డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును 6.60 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పనితీరు మెరుగుపడటంతో 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి వాటికి ప్రభుత్వం ఎలాంటి మూలధనం అందించలేదని ఇటీవలే కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే.
SBI
State Bank of India
Home Loan Interest Rates
Vehicle Loan Interest Rates
MSME Loans
Term Deposits
MCLR
EBLR
Interest Rate Cut

More Telugu News