స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ

  • సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్న మమత
  • స్టేడియంలో పరిస్థితి చూసి తాను వెనుదిరిగానన్న మమతా బెనర్జీ
  • మెస్సీకి, క్రీడాభిమానులకు క్షమాపణ చెప్పిన మమతా బెనర్జీ
అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో చోటు చేసుకున్న గందరగోళంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మెస్సీకి, క్రీడాభిమానులకు ఆమె క్షమాపణలు తెలియజేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమం 'ఎక్స్' ద్వారా ఒక ప్రకటన చేశారు.

మెస్సీతో కొందరు నాయకులు ఫొటోలు దిగుతూ సమయం వృథా చేశారని, అతను పూర్తి మ్యాచ్ ఆడకుండానే వెళ్లిపోయాడని, నిర్వాహకులు ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆరోపిస్తూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెంట్లు కూల్చివేసి, కుర్చీలు ధ్వంసం చేశారు. స్టేడియంలోకి నీళ్ల సీసాలు విసిరి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ స్పందించారు.

మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్‌లేక్ స్టేడియంలో తలెత్తిన నిర్వహణ లోపాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. మెస్సీని చూసేందుకు వచ్చిన వేలాదిమంది క్రీడాభిమానులతో కలిసి తాను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి స్టేడియానికి బయలుదేరానని తెలిపారు. అయితే, అక్కడి పరిస్థితిని చూసి తాను వెనుదిరిగానని ఆమె అన్నారు. స్టేడియంలో జరిగిన ఘటనకు ఆమె క్షమాపణలు కోరారు.

అదే సమయంలో, ఈ ఘటనపై జస్టిస్ అషిమ్ కుమార్ అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. దర్యాప్తు అనంతరం నిర్వహణ వైఫల్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.


More Telugu News