నా ఉన్నతికి కారణం ఉపాధ్యాయులే.. విద్యతో పాటు విలువలు ముఖ్యం: మంత్రి లోకేశ్‌

  • మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు హాజరైన మంత్రి లోకేశ్‌
  • పాఠశాలకు పూర్తి సహకారం అందిస్తానని విద్యాశాఖ మంత్రిగా హామీ
  • కలిసికట్టుగా పాఠశాలను బలోపేతం చేద్దామని పిలుపు
విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో, మానవతా విలువలు కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి తన ఉపాధ్యాయులే కారణమని ఆయన గుర్తుచేసుకున్నారు. మంగళగిరిలోని డాన్ బాస్కో ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవ వేడుకలకు లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని, నూతన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు.

అనంతరం జరిగిన సభలో లోకేశ్‌ మాట్లాడుతూ.. "డాన్ బాస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలకు అండగా నిలుస్తూ, ఇల్లు లేని వారికి నీడ కల్పిస్తూ, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడుతున్న గొప్ప వ్యవస్థ ఇది. 50 ఏళ్లుగా దివ్యాంగులకు అండగా నిలుస్తూ వారి పురోభివృద్ధికి కృషి చేస్తోంది" అని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35 పాఠశాలల ద్వారా విద్యతో పాటు విలువలను అందిస్తోందని కొనియాడారు.

పాఠశాల ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ, ఎయిడెడ్ వ్యవస్థ రద్దయిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యాశాఖ మంత్రిగా పాఠశాలకు అన్ని విధాలా అండగా నిలబడి, సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు ఏ స్థాయికి వెళ్లినా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను, పాఠశాలను మర్చిపోవద్దని సూచించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి డాన్ బాస్కో పాఠశాలను దేశంలోనే అద్భుతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్‌ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు.



More Telugu News