Noida Expressway: నొయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై బీభత్సం.. పొగమంచు కారణంగా ఢీకొన్న పదుల సంఖ్యలో వాహనాలు

Multiple Vehicles Collide On Noida Expressway Due To Dense Fog
  • ఒకదానికొకటి ఢీకొన్న 12కు పైగా కార్లు, ట్రక్కులు
  • ప్రమాదంలో పలువురికి గాయాలు, భారీగా నిలిచిన ట్రాఫిక్
  • ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను కమ్మేసిన పొగమంచుతో తగ్గిన విజిబిలిటీ
ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నొయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై పొగమంచు కారణంగా దారి కనిపించక, 12కు పైగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు, ట్రక్కులు ధ్వంసం కాగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ ఘటన హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళ్లే 135 కిలోమీటర్ల పొడవైన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వే (కుండ్లి-ఘజియాబాద్-పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వే)పై చోటుచేసుకుంది. ప్రమాద స్థలంలో క‌నిపించిన దృశ్యాలు తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఒక కారు ముందు భాగం నుజ్జునుజ్జై డివైడర్‌పైకి ఎక్కగా, మరో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయి కనిపించింది.

ఈ ప్రమాదంపై గౌతమ్ బుద్ధ నగర్ (నొయిడా) పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించింది. పోలీసులు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని తెలిపింది. "ఘటనా స్థలంలో పోలీసులు ఉన్నారు. అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం" అని పేర్కొంది. ప్రస్తుతం ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలు దట్టమైన పొగమంచుతో నిద్రలేచారు. దీని కారణంగా రోడ్లపై విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Noida Expressway
Noida
Expressway Accident
Fog
Delhi NCR
Road Accident
Traffic Jam
Eastern Peripheral Expressway
Gautam Buddh Nagar
Uttar Pradesh

More Telugu News