VC Sajjanar: బలవంతపు వసూళ్లు చేస్తే జైలే.. ట్రాన్స్‌జెండర్లకు సీపీ సజ్జనార్ వార్నింగ్

Hyderabad CP Sajjanar Warns Transgenders of Jail for Extortion
  • చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టీకరణ
  • అమీర్‌పేటలో సుమారు 250 మందితో పోలీసుల సమావేశం
  • వారి సమస్యల పరిష్కారానికి 'ప్రైడ్ ప్లేస్' ఏర్పాటు
  • ప్రభుత్వ పథకాలు వినియోగించుకుని గౌరవంగా బతకాలని సూచన
శుభకార్యాలు, ఇతర వేడుకల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జైలుకు పంపిస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనార్ ట్రాన్స్‌జెండర్లను హెచ్చరించారు. ఇటీవల కాలంలో వీరిపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

ఈ మేరకు అమీర్‌పేటలోని సెస్ ఆడిటోరియంలో సుమారు 250 మంది ట్రాన్స్‌జెండర్లతో సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో గుంపులుగా వెళ్లి ప్రజలను ఇబ్బంది పెట్టడం, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం వంటి చర్యలను మానుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని గౌరవప్రదంగా జీవించాలని సూచించారు. కొంతకాలంగా ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు పెరిగిపోయాయని, ఇది శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న సీఐడీ, మహిళా భద్రతా విభాగం అదనపు ఏడీజీ చారు సిన్హా మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారం కోసం ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమకు ఎలాంటి సమస్య ఎదురైనా, వేధింపులకు గురైనా తక్షణమే ఈ విభాగాన్ని సంప్రదించవచ్చని ఆమె సూచించారు. వారి సమస్యల పరిష్కారానికి మహిళా భద్రతా విభాగం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చారు సిన్హా హామీ ఇచ్చారు.
VC Sajjanar
Hyderabad Police
Transgenders
Charu Sinha
Pride Place
Extortion
Hyderabad
Telangana
Transgender rights
Police warning

More Telugu News