ప్రారంభమైన మెస్సి ఇండియా టూర్.. కోల్‌కతాలో 70 అడుగుల విగ్రహం ఆవిష్కరణ

  • భారత్‌లో అడుగుపెట్టిన ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి
  • కోల్‌కతాలో ప్రారంభమైన ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’
  • హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సాయంత్రం ఎగ్జిబిషన్ మ్యాచ్
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి భారత్‌లో అడుగుపెట్టారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా ఈ తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకున్నారు. ఆయనతో పాటు సహచర క్రీడాకారులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డిపాల్ కూడా వచ్చారు.

కోల్‌కతా విమానాశ్రయంలో మెస్సికి అభిమానులు అర్జెంటీనా జెండాలతో ఘన స్వాగతం పలికారు. ‘మెస్సి.. మెస్సి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా, లేక్‌టౌన్‌లోని తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుక్‌ ఖాన్‌తో కలిసి వర్చువల్‌గా ఆవిష్కరించారు. సాయంత్రం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో ఆయన భేటీ కానున్నారు.

కోల్‌కతా కార్యక్రమం ముగిసిన వెంటనే మెస్సి హైదరాబాద్‌కు బయలుదేరతారు. ఇక్కడ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ‘గోట్ కప్’ పేరుతో ఉప్పల్ స్టేడియంలో జరిగే ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఫుట్‌బాల్ ఆడనుండటం విశేషం. ఈ మ్యాచ్ ను వీక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్నారు. 

మొత్తం 72 గంటల పాటు సాగే ఈ పర్యటనలో భాగంగా మెస్సి డిసెంబర్ 14న ముంబయిలో, 15న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన పర్యటన ముగియనుంది.


More Telugu News