Indigo Airlines: ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల నష్టపరిహారం

IndiGo Will Pay Over Rs 500 Crore To Customers Who Were Severely Stranded
  • జనవరి నుంచి బాధితులను గుర్తించి పరిహారం అందించే ప్రక్రియ
  • కార్యకలాపాల అంతరాయంపై విచారణకు ప్రత్యేక నిపుణుల బృందం
  • పరిస్థితిని సమీక్షిస్తున్న డీజీసీఏ.. సీఈవోకు సమన్లు
ఇటీవలి విమానాల రద్దు, ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారీ ఊరట కల్పించింది. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తం రూ.500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.

విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు, కొన్ని విమానాశ్రయాల్లో తీవ్రంగా చిక్కుకుపోయిన వారికి ఈ పరిహారం అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. "నష్టపరిహారం అందించే ప్రక్రియను వీలైనంత పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడమే మా లక్ష్యం. మా ప్రస్తుత అంచనా ప్రకారం ఈ మొత్తం రూ.500 కోట్లు దాటుతుంది" అని ఇండిగో పేర్కొంది.

ఈ నెల‌ 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమానాలను, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, జనవరిలో వారందరినీ సంప్రదించి సజావుగా పరిహారం అందిస్తామని వివరించింది. ఇప్పటికే చాలా మందికి రిఫండ్‌లు పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేసింది.

మరోవైపు గత నాలుగు రోజులుగా కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఈరోజు దేశవ్యాప్తంగా 2,000లకు పైగా విమానాలను నడపనున్నట్టు ఇండిగో తెలిపింది. కార్యకలాపాల్లో అంతరాయానికి గల మూల కారణాలను విశ్లేషించడానికి ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని 'చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌సీ'ని నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను పిలిచి విచారించింది.
Indigo Airlines
Flight Cancellations
Flight Delay Compensation
Peter Elbers
DGCA
Passenger Compensation
Aviation News
John Elison
Chief Aviation Advisers LLC
Airline Industry

More Telugu News