Nimmala Ramanayudu: వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజన్సీకి ఏపీ మంత్రి నిమ్మల హెచ్చరిక

Nimmala Ramanayudu Warns Veligonda Project Agency on Negligence
  • వెలిగొండ రెండో టన్నెల్‌ను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు
  •  పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కాంట్రాక్ట్ ఏజెన్సీకి హెచ్చరిక
  •  ఉత్తుత్తి ప్రారంభోత్సవంతో జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శ
  •  ప్రజా ప్రభుత్వం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తుందని హామీ
పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని, చేయలేకపోతే తప్పుకోవచ్చని వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. మోసం, దగా అనే పదాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన విమర్శించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రాజెక్టులోని రెండో టన్నెల్‌లో దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించి పనుల పురోగతిని మంత్రి నిమ్మల క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కీలక పనులు పెండింగ్‌లో ఉండగానే, అప్పటి సీఎం జగన్ పైలాన్ ఏర్పాటు చేసి జాతికి అంకితం పేరుతో డ్రామా ఆడారని అన్నారు. వెలిగొండ నీటితో తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. "తల్లినీ, చెల్లినీ మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసగించడం ఒక లెక్కా?" అని ఆయన అన్నారు.

ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను నెరవేరుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని, అందుకే తాను నెలలో మూడుసార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల్లో వేగం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, సీఈ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 
Nimmala Ramanayudu
Veligonda Project
AP Minister
Andhra Pradesh
Irrigation Project
Chandrababu Naidu
YSR Jagan
Prakasam District
TDP
Project Completion

More Telugu News