Elon Musk: ట్రాన్స్‌జెండర్ కూతురిపై వ్యాఖ్యలు.. గవర్నర్‌పై మండిపడ్డ మస్క్

Elon Musk slams Governor Newsom over transgender daughter comment
  • ఎలాన్ మస్క్, కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ మధ్య ఎక్స్ వేదికగా వాగ్వివాదం
  • ఇదంతా 'వోక్ మైండ్ వైరస్' వల్లేనంటూ గవర్నర్‌పై మస్క్ ఆరోపణ
  • తన కుమార్తెను 'కొడుకు'గా సంబోధిస్తూ బదులిచ్చిన టెక్ దిగ్గజం
  • గతంలోనూ వీరిద్దరి మధ్య విధానపరమైన విభేదాలు
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మధ్య సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో మాటల యుద్ధం జరిగింది. మస్క్‌కు దూరంగా ఉంటున్న ఆయన ట్రాన్స్‌జెండర్ కుమార్తెను ఉద్దేశించి గవర్నర్ కార్యాలయం చేసిన ఓ వ్యంగ్య వ్యాఖ్య ఈ వివాదానికి దారితీసింది. దీంతో ఇరువురి మధ్య కొంతకాలంగా నడుస్తున్న సాంస్కృతిక, విధానపరమైన విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

మస్క్‌కు చెందిన 'అమెరికా పీఏసీ' అనే రాజకీయ కమిటీ, గవర్నర్ న్యూసమ్‌కు చెందిన ఓ పాత వీడియో క్లిప్‌ను పోస్ట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ వీడియోలో న్యూసమ్, ఎల్జీబీటీక్యూ హక్కులకు మద్దతుగా మాట్లాడుతూ "నాకు ట్రాన్స్ గాడ్‌సన్ ఉన్నాడు. ట్రాన్స్‌జెండర్ల కోసం నాకంటే ఎక్కువ చట్టాలు చేసిన గవర్నర్ ఎవరూ లేరు" అని అన్నారు. దీనిపై గవర్నర్ ప్రెస్ ఆఫీస్ స్పందిస్తూ "నిజమే. ఎలాన్, మీ కుమార్తె మిమ్మల్ని ద్వేషిస్తున్నందుకు మేం విచారిస్తున్నాం" అని ఘాటుగా బదులిచ్చింది.

ఈ వ్యాఖ్యతో ఆగ్రహానికి గురైన మస్క్ తన కుమార్తె లింగమార్పిడిని తప్పుబడుతూ సమాధానం ఇచ్చారు. "మీరు చెబుతున్నది నా కొడుకు జేవియర్ గురించనుకుంటా. మీరు ప్రోత్సహించే ప్రమాదకరమైన 'వోక్ మైండ్ వైరస్' కారణంగా అతడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. నా కొడుకు జేవియర్‌ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. అతడు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని మస్క్ పేర్కొన్నారు. తన మిగతా పిల్లలు తనను ప్రేమిస్తున్నారని కూడా ఆయన తెలిపారు.

కాగా, మస్క్ కుమార్తె వివియన్ జెన్నా విల్సన్ 2022లో చట్టబద్ధంగా తన తండ్రితో సంబంధాలను తెంచుకున్నారు. "నా బయోలాజికల్ ఫాదర్‌తో ఎలాంటి సంబంధం కోరుకోవడం లేదు" అని ఆమె అప్పట్లో స్పష్టం చేశారు. మస్క్, న్యూసమ్ మధ్య విభేదాలు రావడం ఇదే తొలిసారి కాదు. ట్రాన్స్‌జెండర్ విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు చెప్పకుండా పాఠశాలలను నిరోధించే చట్టంపై 2024లో న్యూసమ్ సంతకం చేశారు. దీనిని వ్యతిరేకించిన మస్క్, తన స్పేస్‌ఎక్స్, ఎక్స్ కంపెనీల ప్రధాన కార్యాలయాలను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు తరలించిన విషయం తెలిసిందే.
Elon Musk
Gavin Newsom
Transgender daughter
Vivian Jenna Wilson
California Governor
Xavier Musk
LGBTQ rights
Woke mind virus
Social media
Political conflict

More Telugu News