Dharmendra Pradhan: బీజేపీ కొత్త బాస్ ఎవరు?.. రేసులో ముందంజలో ధర్మేంద్ర ప్రధాన్!

Who is the new BJP Chief Dharmendra Pradhan leading the race
  • బీజేపీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు
  • పార్లమెంట్ సమావేశాల తర్వాత వేగవంతం కానున్న ప్రక్రియ
  • ఈ వారాంతంలోనే యూపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి
  • శివరాజ్ సింగ్, భూపేంద్ర యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ నెల 19న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. జాతీయ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా, మరికొందరు సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటికే 29 రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను బీజేపీ పూర్తి చేసింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో యూపీ బీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ఈ వారాంతంలోనే పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పరిశీలకుడిగా వ్యవహరించనుండగా, ఆదివారం నాటికి కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ పదవికి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.

మరోవైపు, కర్ణాటకలో ఏకాభిప్రాయం కుదరకపోతే అక్కడి అధ్యక్షుడి ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రాల ప్రక్రియ పూర్తయిన వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై దృష్టి సారించనున్నారు. బీహార్‌తో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ధర్మేంద్ర ప్రధాన్‌కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్‌లాల్ ఖట్టర్‌ల పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Dharmendra Pradhan
BJP National President
Bharatiya Janata Party
BJP Elections
Piyush Goyal
Keshav Prasad Maurya
Bhupender Yadav
Shivraj Singh Chouhan
Manohar Lal Khattar
Indian Politics

More Telugu News