Shahid Rashid: పాకిస్థాన్ యూనివర్సిటీలో సంస్కృత బోధన!

Shahid Rashid Sanskrit Teaching Starts in Pakistan University
  • పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృతం, గీతా పాఠాలు
  • దేశ విభజన తర్వాత ఇలా జరగడం ఇదే ప్రథమం
  • వర్క్‌‌షాప్‌కు వచ్చిన స్పందనతో అధికారిక కోర్సుగా మార్పు
  • ఇది ఏ ఒక్క మతానికో చెందిన భాష కాదన్న ప్రొఫెసర్
  • 15 ఏళ్లలో పాక్ నుంచే గీతా పండితులు వస్తారని అంచనా
పాకిస్తాన్‌లో ఒక చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. దేశ విభజన తర్వాత తొలిసారిగా అక్కడి ఓ ప్రముఖ యూనివర్సిటీలో సంస్కృతం, మహాభారతం, భగవద్గీత పాఠాలు వినిపించాయి. లాహోర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్ (ఎల్‌యూఎంఎస్) సంస్కృతాన్ని అధికారిక కోర్సుగా ప్రారంభించింది.
 
మూడు నెలల పాటు నిర్వహించిన సంస్కృత వర్క్‌షాప్‌కు విద్యార్థుల నుంచి ఊహించని స్పందన రావడంతో దీనిని పూర్తిస్థాయి కోర్సుగా మార్చినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 2027 నాటికి ఇది ఏడాది కోర్సుగా మారనుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలు, మహాభారతంలోని కథలను బోధించనున్నారు.
 
ఈ పరిణామం వెనుక ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీ ప్రొఫెసర్ షాహిద్ రషీద్ కృషి ఉందని 'ది ట్రిబ్యూన్' తన కథనంలో పేర్కొంది. సంస్కృతం దక్షిణాసియా ప్రాంతాన్ని కలిపే భాష అని, ఇది ఏ ఒక్క మతానికీ పరిమితం కాదని రషీద్ వివరించారు. సంస్కృత వ్యాకరణ పండితుడు పాణిని జన్మించిన గ్రామం కూడా నేటి పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలోనే ఉందని ఆయన గుర్తుచేశారు.
 
మొదట్లో సంస్కృతం నేర్చుకోవడం కష్టమని విద్యార్థులు భావించినా, ఉర్దూ భాషపై దాని ప్రభావాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయారని ప్రొఫెసర్లు చెబుతున్నారు. మరో 10-15 ఏళ్లలో పాకిస్తాన్ నుంచే గీత, మహాభారత పండితులు తయారవుతారని మరో ప్రొఫెసర్ అలీ ఉస్మాన్ ఖాస్మీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Shahid Rashid
Pakistan
Sanskrit
Bhagavad Gita
Mahabharata
Lahore University of Management Sciences
LUMS
Urdu
South Asia
Panini

More Telugu News