Mahesh Kumar Goud: ఆత్మహత్యలు చేసుకోవద్దు: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Urges No Suicides Over BC Reservations
  • ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నేతలు
  • పరామర్శించిన మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులు
  • బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్న మహేశ్ కుమార్ గౌడ్
బీసీలకు రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేస్తామని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం చూపలేవని ఆయన అన్నారు. యువత ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. బీసీ రిజర్వేషన్లను సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఈశ్వరాచారి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్, టీపీసీసీ సంవిధాన్ బచావో కమిటీ ఛైర్మన్ డా.వినయ్, కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరులు ఈశ్వరాచారి కుటుంబాన్ని ఓదార్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. అంతేకాకుండా, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తున్నట్లు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలులో అన్యాయం జరిగిందంటూ ఈశ్వరాచారి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న కార్యాలయం ముందు రహదారిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన ఈశ్వరాచారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
Mahesh Kumar Goud
TPCC
BC Reservations
Eshwarachari
Ponnam Prabhakar
Telangana

More Telugu News