Rammohan Naidu: విమాన ఛార్జీల పెరుగుదలపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

Rammohan Naidu on Flight Fare Hike Key Statement
  • టిక్కెట్ ఛార్జీలపై ఏడాది పొడవునా పరిమితి విధించడం సాధ్యం కాదని స్పష్టీకరణ
  • పండుగల సీజన్‌లో టిక్కెట్ ధరలు పెరగడం సహజమేనని వెల్లడి
  • అవసరమైనప్పుడు మాత్రం ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందన్న రామ్మోహన్ నాయుడు
విమానయాన రంగంలో టిక్కెట్ ఛార్జీల పెరుగుదలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ రంగంలో ఏడాది పొడవునా టిక్కెట్ ఛార్జీలపై పరిమితి విధించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమాన టిక్కెట్ ధరలను నియంత్రించాలంటూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై ఆయన మాట్లాడారు.

టిక్కెట్ ధరల డీ-రెగ్యులేషన్ వల్ల పౌరవిమానయాన రంగం వృద్ధి చెందుతుందని, వినియోగదారులకు కూడా ప్రయోజనకరమని అన్నారు. అప్పుడే కొత్త సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పండుగల సీజన్‌లో మాత్రం టిక్కెట్ ధరలు పెరగడం సహజమే అన్నారు. అలాగని ఆయా సంస్థలు ఇష్టం వచ్చినట్లు ధరలు పెంచుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.

అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని అన్నారు. కంపెనీలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కేంద్రం జోక్యం చేసుకున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. కరోనా, కుంభమేళా, పహల్గామ్ ఉగ్రదాడి వంటి సమయాల్లో విమాన టిక్కెట్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుందని గుర్తు చేశారు. కేంద్రం తన ప్రత్యేక అధికారాలను వినియోగించి టిక్కెట్ ధరలను అదుపు చేసిందని అన్నారు.

ఇండిగో సంక్షోభ సమయంలోనూ టిక్కెట్ ధరలను నియంత్రించినట్లు సభకు తెలిపారు. ఈశాన్య, దక్షిణాదిలోని 25 మార్గాల్లో టిక్కెట్ల ధరలను స్థిరంగా ఉంచేందుకు 'ఫేర్ సే ఫర్సత్' పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఏవియేషన్ ఎకో సిస్టం అభివృద్ధికి దీర్ఘకాలిక దృష్టితో ప్రభుత్వం చూడాల్సి ఉంటుందని అన్నారు. ఛార్జీలపై పరిమితి ఒక్కటే పరిష్కారం కాదని ఆయన అన్నారు. ద్రవ్యోల్భణాన్ని పరిగణనలోకి తీసుకుంటే టిక్కెట్ ధరలు తగ్గుముఖం పట్టాయని అన్నారు.
Rammohan Naidu
aviation sector
flight ticket prices
ticket fares regulation
Indigo crisis
civil aviation growth

More Telugu News