Shehbaz Sharif: పుతిన్ కోసం 40 నిమిషాల వెయిటింగ్... ఆగలేక కీలక సమావేశంలోకి దూసుకెళ్లిన పాక్ ప్రధాని!

Shehbaz Sharif Faces Wait Putin Enters Meeting
  • పుతిన్‌తో భేటీ కోసం 40 నిమిషాలు వేచి చూసిన షెహబాజ్ షరీఫ్
  • పుతిన్-ఎర్డోగాన్ సమావేశం జరుగుతున్న గదిలోకి ప్రవేశం
  • తుర్క్‌మెనిస్థాన్ అంతర్జాతీయ సదస్సులో చోటుచేసుకున్న ఘటన
  • ఈ సంఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు
  • దౌత్యపరమైన తప్పిదంగా మారిన పాక్ ప్రధాని చర్య
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ముందుగా నిర్ణయించిన ద్వైపాక్షిక సమావేశం ఆలస్యం కావడంతో, ఆయన ఏకంగా పుతిన్-ఎర్డోగాన్ మధ్య జరుగుతున్న అత్యంత కీలకమైన, రహస్య సమావేశంలోకి వెళ్లారు. ఈ చర్య తీవ్ర విమర్శలకు దారితీయడమే కాకుండా, దౌత్యపరంగా పాకిస్థాన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే...

తుర్క్‌మెనిస్థాన్ శాశ్వత తటస్థతకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు ఆ దేశంలో ఒక అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా సమావేశం కావాల్సి ఉంది. అయితే, షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ భేటీ ఆలస్యమైంది. దీంతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో కలిసి పక్క గదిలో దాదాపు 40 నిమిషాల పాటు షెహబాజ్ షరీఫ్ నిరీక్షించారు.

సమయం గడుస్తున్నా పుతిన్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో షెహబాజ్ షరీఫ్ అసహనానికి గురయ్యారు. ఇక వేచి ఉండటంలో లాభం లేదనుకుని, కనీసం ఒక్కసారైనా పలకరించాలనే ఉద్దేశంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో వ్లాదిమిర్ పుతిన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌తో ఒక గదిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారిద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరుగుతుండగా, షెహబాజ్ షరీఫ్ అనూహ్యంగా ఆ గదిలోకి ప్రవేశించారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అలా లోపలికి వెళ్లిన ఆయన, దాదాపు 10 నిమిషాల తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం.

ఈ ఘటన మొత్తం కెమెరాల్లో రికార్డ్ కావడంతో, అది కాస్తా బయటకు పొక్కింది. సోషల్ మీడియాలో ఈ వీడియోపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇది పాకిస్థాన్ చేసిన పెద్ద దౌత్యపరమైన తప్పిదమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. "అడుక్కునే వాళ్లతో మాట్లాడి పుతిన్ తన సమయాన్ని వృథా చేసుకోరు" అని ఒకరు కామెంట్ చేయగా, "గతంలో ట్రంప్ కూడా వీరితో ఇలాగే ప్రవర్తించారు" అని మరొకరు ఎగతాళి చేశారు. 

కాగా, ఐక్యరాజ్యసమితి ఆమోదంతో 1995 డిసెంబర్ 12న తుర్క్‌మెనిస్థాన్ శాశ్వత తటస్థ దేశంగా గుర్తింపు పొందింది. ఈ విధానం ప్రకారం ఆ దేశం ఎలాంటి సైనిక కూటముల్లో చేరదు, వివాదాలకు దూరంగా ఉంటుంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సదస్సులో పాక్ ప్రధాని చర్య విమర్శలకు దారితీసింది.
Shehbaz Sharif
Vladimir Putin
Pakistan
Turkey
Erdogan
Turkmenistan
International Summit
Diplomatic Protocol
Pakistan Prime Minister
Russia

More Telugu News