Supreme Court of India: భూకంపాల నివారణ కోర్టు పనా?... పిటిషనర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court Dismisses Earthquake Prevention PIL
  • భూకంపాల నష్టంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
  • 'అందరినీ చంద్రుడిపైకి తరలించాలా?' అంటూ ఘాటుగా ప్రశ్నించిన ధర్మాసనం
  • మన దేశాన్ని జపాన్‌తో పోల్చడం సరికాదని హితవు
  • ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన కోర్టు
భూకంపాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, "అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరినీ చంద్రుడిపైకి తరలించాలా?... అయినా భూకంపాల నివారణ కోర్టు పనా?" అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

భారత్‌లో సుమారు 75 శాతం మంది ప్రజలు భూకంపాలు సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారని, వారి భద్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జపాన్‌లో భూకంపాలు వచ్చినా అక్కడి ఆధునిక సాంకేతికత, పటిష్టమైన భవన నిర్మాణాల వల్ల నష్టం తక్కువగా ఉంటుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. అదే తరహాలో ఇక్కడ కూడా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వాదనలను తోసిపుచ్చింది. "మన దేశ పరిస్థితులను జపాన్‌తో ఎలా పోలుస్తారు? అలా పోల్చాలంటే ముందు మన దేశంలోకి అగ్నిపర్వతాలను తీసుకురావాలి. భూకంపాల నష్టాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాల్సింది ప్రభుత్వం... న్యాయస్థానం కాదు" అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెబుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.

హిమాలయాల కారణంగా భారతదేశం కూడా భూకంప ప్రభావిత దేశమని, ప్రమాదకర ప్రాంతాల్లో భవన నిర్మాణ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు ఎప్పటినుంచో సూచిస్తున్నారు.
Supreme Court of India
Earthquake prevention
Public Interest Litigation
PIL
Justice BR Gavai
Earthquake disaster management
India earthquake prone zones
Japan earthquake technology
Disaster management
Building construction regulations

More Telugu News