Nara Lokesh: నాడు దావోస్ లో ఏం జరిగిందో చెప్పిన మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Explains Davos Event Details
  • విశాఖలో కాగ్నిజెంట్ శాశ్వత క్యాంపస్‌కు శంకుస్థాపన
  • ఎకరా భూమిని 99 పైసలకే కేటాయించామని వెల్లడించిన మంత్రి లోకేష్
  • దావోస్‌లో తన పుట్టినరోజున ఒప్పందానికి బీజం పడిందని వెల్లడి
  • ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇదే నిదర్శనమని వ్యాఖ్య
  • చంద్రబాబు నాయకత్వ పటిమ వల్లే ఇది సాధ్యమైందని స్పష్టం
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కొత్త శకం మొదలైంది. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్, విశాఖపట్నంలో తన శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మధురవాడ ఐటీ సెజ్‌లో శుక్రవారం జరిగిన ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, విశాఖకు కాగ్నిజెంట్ రావడం ఒక చారిత్రక మైలురాయి అని, నగరాన్ని రాష్ట్రానికి ఆర్థిక పవర్‌హౌస్‌గా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది మరింత బలాన్నిస్తుందని అన్నారు. ఈ ఒప్పందం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను ఆయన సభతో పంచుకున్నారు.

"ఈ ఒప్పందం వెనుక ఓ కథ ఉంది. నా పుట్టినరోజైన జనవరి 23న దావోస్‌లో ఈ ప్రయాణం మొదలైంది. నేను కాగ్నిజెంట్ ప్రతినిధి రవి గారిని కలిసినప్పుడు, ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ ఓపికగా సమాధానమిచ్చాను. ముఖ్యమంత్రి గారి అనుమతితో ఎకరా భూమిని కేవలం 99 పైసలకే కేటాయిస్తామని చెప్పాను. నా మాటలకు రవి గారు ఆశ్చర్యపోయారు. ఇది నిజంగా సాధ్యమేనా అని అడిగారు. ఇదే విషయం సీఎం గారితో చర్చిస్తే.. 99 పైసలకే భూమి ఇస్తే పరిశ్రమలు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. అవకాశం ఇస్తే విశాఖలో చరిత్ర సృష్టిస్తానని నేను బదులిచ్చాను. ఆ నమ్మకంతోనే ఈ రోజు కాగ్నిజెంట్ విశాఖకు వచ్చింది" అని లోకేశ్ వివరించారు.

ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి 11 నెలల సమయం అంటే చాలా ఎక్కువ. ఆయన ప్రతీదీ రియల్ టైమ్‌లో జరగాలని ఆశిస్తారు. ఆయన కేబినెట్‌లోని మంత్రులందరికీ రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఇచ్చారు. అందరూ 1995 నాటి యుగం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు 2024 యుగం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగువారిని గర్వపడేలా చేస్తాం" అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.

"చాలా రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గురించి మాట్లాడుతోంది. ఇక్కడ నిర్ణయాలు ఫైళ్లలో ఆగిపోవు, ఇలాంటి శంకుస్థాపనలుగా రూపాంతరం చెందుతాయి. మేము రెడ్ టేప్‌ను రెడ్ కార్పెట్‌గా మార్చేశాం. అందుకు కాగ్నిజెంట్ రాకే ప్రత్యక్ష ఉదాహరణ" అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం తమ అదృష్టమని, ఆయన పెద్ద కలలు కంటారని, రాష్ట్రాన్ని అంతకంటే ఉన్నత శిఖరాలకు తీసుకెళతామని లోకేశ్ తెలిపారు. కాగ్నిజెంట్ విశాఖను ఎంచుకోవడం ప్రభుత్వ పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Nara Lokesh
Cognizant
Visakhapatnam
Andhra Pradesh
IT Sector
Davos
Chandrababu Naidu
AP Development
Ease of Doing Business
IT Campus

More Telugu News