Indigo Airlines: సొంత దర్యాప్తు కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించిన ఇండిగో

Indigo Appoints International Aviation Consultancy for Investigation
  • ఇటీవలి విమాన సర్వీసుల అంతరాయంపై ఇండిగో దర్యాప్తు
  • స్వతంత్ర ఏవియేషన్ కన్సల్టెన్సీని నియమించిన సంస్థ
  • ఏవియేషన్ నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలో విచారణ
  • సమస్య మూలాలను గుర్తించి నివేదిక ఇవ్వనున్న నిపుణుల బృందం
  • స్వల్ప లాభంతో ముగిసిన ఇండిగో షేర్లు
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తమ సర్వీసుల్లో ఇటీవల తలెత్తిన కార్యాచరణ అంతరాయాలపై దర్యాప్తునకు ఓ స్వతంత్ర ఏవియేషన్ కన్సల్టెన్సీని నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏవియేషన్ రంగ నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని ‘చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌సి’ ఈ విచారణ చేపట్టనుంది.

ఇటీవల ఇండిగో విమానాలు తీవ్ర అంతరాయాలకు గురైన నేపథ్యంలో, సమస్యకు గల కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించేందుకు ఈ నియామకం చేపట్టినట్టు సంస్థ తెలిపింది. ఈ నియామకానికి ఇండిగో బోర్డు ఆమోదం తెలిపిందని ప్రకటనలో పేర్కొంది. అంతకుముందు, ఈ విషయంపై ఏర్పాటైన ఇండిగో క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్... ఓ స్వతంత్ర నిపుణుడితో దర్యాప్తు జరిపించాలని బోర్డుకు సిఫార్సు చేసింది.

కెప్టెన్ జాన్ ఇల్సన్‌కు గ్లోబల్ ఏవియేషన్ రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆయన ఎఫ్ఏఏ, ఐసీఏఓ, ఐఏటీఏ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేశారు. ఆయన నైపుణ్యం సమస్య మూలాలను గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా మెరుగైన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇండిగో విశ్వాసం వ్యక్తం చేసింది.

విచారణ పూర్తయిన తర్వాత కెప్టెన్ ఇల్సన్ నేతృత్వంలోని బృందం బోర్డుకు ఒక సమగ్ర నివేదికను సమర్పిస్తుంది. తమ కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఇండిగో స్పష్టం చేసింది. కాగా, ఈ ప్రకటన నేపథ్యంలో శుక్రవారం ఎన్ఎస్ఈలో ఇండిగో షేరు ధర రూ.43 (0.89%) మేర లాభపడి రూ.4,862 వద్ద ముగిసింది.
Indigo Airlines
Aviation Consultancy
Flight Disruptions
John Elison
Chief Aviation Advisers LLC
DGCA
Airline Investigation
Air Travel
Indigo Share Price
Aviation Sector

More Telugu News