IndiGo: ఇండిగో సంక్షోభం... రంగంలోకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా

IndiGo Crisis Competition Commission of India Investigates
  • అంతర్గత లోపాల కారణంగా వందలాది విమానాలను రద్దు చేసిన ఇండిగో
  • సంస్థ కార్యకలాపాలపై దృష్టి సారించిన డీజీసీఏ
  • పోటీ నిబంధనలను ఉల్లంఘించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సీసీఐ
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రంగంలోకి దిగింది. అంతర్గత లోపాల కారణంగా ఇండిగో వందలాది విమానాలను రద్దు చేయడంతో డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది. సంస్థ కార్యకలాపాలపై డీజీసీఏ దృష్టి సారించింది. ఇప్పుడు సీసీఐ కూడా రంగంలోకి దిగి, పోటీ నిబంధనలను ఇండిగో ఉల్లంఘించిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దేశీయ పౌర విమానయాన రంగంలో ఇండిగో దాదాపు 65 శాతం వాటాను కలిగి ఉంది. ఈ సంస్థ డిసెంబర్ 2 నుంచి వందలాది విమానాలను రద్దు చేసింది. దీంతో కొన్ని వేల మంది తమ ప్రయాణాలు రద్దై ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై డీజీసీఏ దర్యాప్తు చేస్తోంది.

పెద్ద ఎత్తున విమానాల రద్దుకు అతిపెద్ద మార్కెట్ వాటాను కలిగి ఉండటమే కారణమా అనే కోణంలో సీసీఐ అంతర్గతంగా పరిశీలిస్తోంది. దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని, సుమోటోగా అంశాన్ని సీసీఐ పరిశీలిస్తోందని సీనియర్ అధికారి పీటీఐకి వెల్లడించారు. విమానయాన రంగంలో ఆధిపత్య స్థానం, నిర్దిష్ట మార్గాల్లో ఆధిపత్యం, ఆధిపత్య దుర్వినియోగం వంటి అంశాలను సీసీఐ పరిశీలిస్తోందని సమాచారం.

అత్యధిక మార్కెట్ వాటా కలిగి ఉండటం పోటీని ఉల్లంఘించినట్లు కాదు కానీ, ఆ ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం పోటీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని సీసీఐ సంబంధిత అధికారి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు చేసి, పోటీ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంటుంది.
IndiGo
IndiGo crisis
Competition Commission of India
CCI
DGCA
flight cancellations

More Telugu News