Rohini Acharya: నితీశ్ కుమార్ ప్రభుత్వానికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె ప్రశంసలు

Rohini Acharya Praises Nitish Kumar Government
  • మహిళల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించిన రోహిణి ఆచార్య
  • కుమార్తెల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని వ్యాఖ్య
  • తల్లిదండ్రుల ఇళ్లలో కుమార్తెలు భయం లేకుండా ఉండే హక్కు వారికి ఉందన్న రోహిణి
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె కొనియాడారు. అయితే, స్త్రీల అభివృద్ధికి రూ.10 వేలు పంపిణీ చేయడం, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం మాత్రమే సరిపోదని, కొడుకులతో సమానంగా కుమార్తెలకు హక్కులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

కుమార్తెల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అని ఆమె అన్నారు. ప్రజల్లో పాతుకుపోయిన పితృస్వామ్య మనస్తత్వం, రాజకీయ రంగాలలో మార్పు తీసుకురావాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. తల్లిదండ్రుల ఇళ్లలో కుమార్తెలు ఎటువంటి భయం లేకుండా సురక్షితంగా ఉండే హక్కు వారికి ఉందని అన్నారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని నితీశ్ ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు.

భవిష్యత్తులో దోపిడీ, హింస నుంచి మహిళలను రక్షించడానికి ఇది ఒక ముందడుగుగా భావించాలని పేర్కొన్నారు. ప్రతి స్త్రీ, తల్లిదండ్రుల ఇళ్లలో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రోహిణి ఆచార్య నితీశ్ ప్రభుత్వాన్ని కోరారు.

కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఇప్పటికే పలు సమస్యలు తలెత్తడంతో పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో లాలూ కుమార్తెలు కూడా ఆయన ఇంటి నుంచి వెళ్లిపోవడం తెలిసిందే. 

ఈ క్రమంలో రోహిణి సోషల్ మీడియా వేదికగా నితీశ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడంతో పాటు కీలక సూచనలు చేశారు.
Rohini Acharya
Nitish Kumar
Bihar Government
Lalu Prasad Yadav
Women Empowerment

More Telugu News