Indigo: ఇండిగోకు మ‌రో షాక్.. రూ.58 కోట్ల జరిమానా

Indigo Faces Rs 58 Crore Penalty Amid Crisis
  • ఇండిగోకు రూ.58.75 కోట్ల జీఎస్టీ జరిమానా
  • వందల విమానాలు రద్దు కావడంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
  • నిర్లక్ష్యం వహించిన నలుగురు ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్లను తొలగించిన డీజీసీఏ
ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. కొద్ది రోజులుగా వందల కొద్దీ విమానాలను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ సంస్థపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇదే సమయంలో కంపెనీకి రూ.58.75 కోట్ల జీఎస్టీ జరిమానా విధిస్తూ అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ సౌత్ కమిషనరేట్‌కు చెందిన సీజీఎస్టీ అదనపు కమిషనర్ కార్యాలయం నుంచి నిన్న‌ ఈ ఆర్డర్ అందినట్లు తెలిపింది. 

మరోవైపు ఇండిగోలో నెలకొన్న గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇండిగో భద్రత, కార్యాచరణ ప్రమాణాలను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఫ్లైట్ ఇన్‌స్పెక్టర్లను విధుల నుంచి తొలగించింది. 

అటు పరిస్థితిని చక్కదిద్దేందుకు డీజీసీఏ రంగంలోకి దిగింది. ఇండిగో కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేందుకు రెండు ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను గురుగ్రామ్‌లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు డీజీసీఏకు నివేదిక సమర్పిస్తాయి. ఒక బృందం విమానాల సంఖ్య, పైలట్ల లభ్యత, సిబ్బంది పనిగంటలు, శిక్షణ షెడ్యూళ్లు వంటి కార్యాచరణ అంశాలను పరిశీలిస్తుండగా, మరో బృందం ప్రయాణికులపై ప్రభావం, రిఫండ్‌ల స్థితి, సామాను తిరిగి ఇవ్వడం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది.
Indigo
Indigo Airlines
Interglobe Aviation
DGCA
Flight cancellations
GST penalty
Aviation crisis
Flight inspectors
Civil Aviation
Airline operations

More Telugu News