Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్

Chinnaswamy Stadium Gets Green Light for Cricket Matches
  • భద్రతా చర్యలతో నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి
  • దుర్ఘటన తర్వాత నిలిచిపోయిన మ్యాచ్‌ల పునరుద్ధరణ
  • డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన
  • హోంమంత్రి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మ్యాచ్‌లకు అనుమతి ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమార్ శుక్రవారం ప్రకటించారు. బెలగావిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

"బెంగళూరు నగరం ప్రతిష్ఠ‌ను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం" అని శివకుమార్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లను హోంమంత్రి జి. పరమేశ్వర పర్యవేక్షిస్తారని, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్, పోలీసు అధికారులతో చర్చించి తుది ప్రణాళికను సిద్ధం చేస్తారని వివరించారు. నిన్న‌ రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జూన్ 4న‌ జరిగిన ఓ విజయోత్సవ వేడుక సందర్భంగా స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను నిలిపివేశారు. ఇటీవల కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్, ఇతర ఆఫీస్ బేరర్లు.. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసి మ్యాచ్‌ల పునరుద్ధరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తాజా నిర్ణయంతో 2026 ఐపీఎల్ సహా అన్ని మ్యాచ్‌లు ఇకపై ఇక్కడే జరగనున్నాయి.
Chinnaswamy Stadium
DK Shivakumar
Bengaluru
Karnataka
Cricket
IPL 2026
Venkatesh Prasad
KSCA
Cricket Match
Stadium Security

More Telugu News